NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత!

మాజీ సీఎం కేసీఆర్‌ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్‌ జిరాక్స్‌ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్‌ సెంటర్‌ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు.

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఉద్యమ కారుడు చిర్ర లింగన్న కుమారుడు సతీష్. సతీశ్‌కు చిన్నప్పటి నుంచి కేసీఆర్‌ అంటే ప్రాణం. 2001లో టీఆర్‌ఎస్‌ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించిన సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2025 ఫిబ్రవరి 17న కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఇంటర్నెట్ సెంటర్‌ ద్వారా తనకు స్వయం ఉపాధికి కల్పించాలని ఎమ్మెల్పీ కవితకు విజ్ఞప్తి చేశారు. సతీష్ విజ్ఞప్తికి కవిత వెంటనే స్పందించి.. సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వారం రోజుల్లోనే సొంతం ఖర్చులతో ఇంటర్నెట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. ఈ ఇంటర్నెట్‌ సెంటర్‌కు కేసీఆర్‌ పేరును సతీశ్‌ పెట్టుకున్నాడు. జిల్లా పర్యటనలో భాగంగా నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్‌ను ప్రారంభించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన రోజే సమావేశాలను బాయ్‌ కాట్‌ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. గవర్నర్‌ ప్రసంగం సమయంలో.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేసి.. ఆ తర్వాత పోడియం వద్ద నిరసన వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అనంతరం గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు.. ఇక, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్‌ జగన్‌.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు..

టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అనడం విడ్డురంగా ఉందని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడం వలనే ప్రమాదం జరిగింది. మేము ప్రాజెక్టును ఆలస్యం చేశామనేది శుద్ధ తప్పు. మేము ఎస్‌ఎల్‌బీసీ కోసం అసెంబ్లీలో చర్చ పెట్టి అఖిలపక్షం ఏర్పాటు చేశాము. ఇది పూర్తి చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాము. ఎస్‌ఎల్‌బీసీ ప్రపంచంలోనే క్రిటికల్, సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.

పులివెందుల ఉప ఎన్నిక కాదు.. మంగళగిరి, పిఠాపురం, కుప్పం సిద్ధమా..?

కూటమి సర్కార్‌కు సవాల్‌ విసిరారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. పులివెందుల ఉప ఎన్నిక కాదు.. సూపర్ సిక్స్ పథకాలు రెఫరండంతో మంగళగిరి, పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్‌ విసిరారు.. కడప నగరంలోని ఓ దేవాలయ శంకుస్థాపనకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోవడంతో ప్రజల్లో అప్పుడే అసంతృప్తి వస్తోందన్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్‌ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఉన్నది ఒకే ప్రతిపక్షం అని, 11 సీట్లు అన్నది లెక్క కాదన్నారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే వైఎస్‌ జగన్.. అసెంబ్లీకి వస్తారని.. వాళ్లకు సినిమా కనబడుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తాము అసెంబ్లీలో సంధించే ప్రశ్నలకు భయపడే ఆ హోదా ఇవ్వలేదన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి కుట్ర చేస్తున్నారని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

మార్చి 19వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.. మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు జరగనున్నాయి.. అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని బీఏసీలో నేతలు అభిప్రాయపడ్డారు.. అయితే, వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభం అయ్యాయి.. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు గవర్నర్.. అబ్దుల్ నజీర్.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు…8 నెలల పాలన…భవిష్యత్తు లక్ష్యాలు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని గవర్నర్ తన ప్రసంగం లో వివరించారు. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారన్నారు గవర్నర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం అన్నారు..

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్. వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఈ రోజు ( ఫిబ్రవరి 24) ఆదేశాలు జారీ చేసింది. అయితే, వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం స్పందించింది. ఈ సందర్భంగా వంశీకి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక, వంశీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులను సూచించింది.

జగన్కి కావాల్సింది ప్రతిపక్ష హోదానే.. ప్రజా సమస్యలు కాదు..

జగన్ రెడ్డికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే ప్రజా సమస్యలు కాదు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసన సభా సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి సభకు వచ్చారు.. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యల్నీ సమర్ధవంతంగా లేవనెత్తారు అని పేర్కొన్నారు. ఇక, లోక్ సభలో వాజ్ పేయికి ప్రతిపక్ష నేత హోదా లేకున్నా దేశ సమస్యలను అర్థవంతంగా సభ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ రాహుల్ గాంధీ సభకు హాజరై ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటారు అని మంత్రి అనగాని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.. ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీనే కడుతున్నాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి తేదీన వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఆయన పాలనలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ల హామీలు ఇచ్చినా, అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ.. నగరిలో తాజా పరిణామాలపై చర్చ..!

వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా, గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండవ కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేసిన పార్టీ అధిష్టానం. అయితే, గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో అతడి చేరికకు బ్రేక్ పడింది. ఇక, ఇవాళ (ఫిబ్రవరి 24) అదే అంశంపై రోజాతో మాజీ సీఎం వైఎస్ జగన్ చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో గాలి జగదీష్ ప్రకాష్ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.