ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది..
ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆయన పర్యటించారు. గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం…. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లను అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలన్నారు.
పంట నష్టంతో అప్పులు తీరే పరిస్థితి లేదు.. బండి సంజయ్ తో రైతులు
పంట నష్టంతో చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో కౌలు రైతు నారాయణ కన్నీటి పర్యంతమయ్యాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతు దెబ్బడ నారాయణ పొలాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. తనకున్న 2 ఎకరాల పొలంతోపాటు మరో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నానని నారాయణ తెలిపాడు. అకాల వర్షాలతో 5 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, తాలు మాత్రమే మిగిలిందని నారాయణ కుటుంబం వాపోయింది. ఎకరాకు రూ.10 వేలు కౌలు పైసలివ్వడంతోపాటు పెట్టుబడి కింద రూ.లక్షన్నర ఖర్చు చేశానని నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.
బీఆర్‌ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి మహబూబ్ నగర్ జడ్పీచైర్ పర్సన్
మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇవాల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీచంద్ రెడ్డి కూడా స్వర్ణ సుధాకర్ రెడ్డి వెంటే ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. ఈ క్రమంలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలను కూడా తనవైపు తిప్పుకోనుంది.
సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారు..
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తు పరంగా వెంకన్నపాలెం గ్రామం నుంచే గత రెండు ఎన్నికలలో ప్రచారాన్ని ప్రారంభించానని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మరోసారి కూడా ఈ గ్రామం నుంచి ప్రచారాన్ని చేపట్టామన్నారు.
ఈటలకు.. బండి సంజయ్ కి పడదు..!
ఈటలకు.. బండి సంజయ్ కి పడదని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఔట్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఫైట్ అన్నారు. అధ్యక్ష పదవి నుండి ఎందుకు తొలగించిందో ..? బండి సంజయ్ చెప్పాలన్నారు. బండి సంజయ్ పై అవినీతి ఆరోపణలు.. కరీంనగర్ నుండి ఇప్పటి వరకు ఎవరికి అలాంటి పేరు రాలేదన్నారు. ఈటలకు.. బండి సంజయ్ కి పడదన్నారు. ముందు కరీంనగర్ ప్రజలకు ఏం చేశావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కి గంగుల కమలాకర్ కి ఎంత సన్నిహిత్యమో అందరికి తెలుసన్నారు. వర్షాలు పడాల్సింది సెప్టెంబర్ లో అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ అన్నారు. మేము అధికారం లోకి వచ్చింది డిసెంబర్ లో అది వర్షాకాలం కాదన్నారు. అయినా దానికి బాద్యులు వాళ్ళని మేము అనట్లేదన్నారు. పంట నష్టం గురుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆస్కార్ అవార్డు పొందాలంటే ఎంత తాపత్రయం పడుతారో.. నటనలో బండి సంజయ్ అంత తాపత్రయం పడుతున్నారని వ్యంగాస్త్రం వేశారు.
అటు పవన్ను.. ఇటు బీజేపీని చంద్రబాబు మోసం చేస్తున్నాడు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇంప్రెస్ చేయడానికి ఆయన నానా పాట్లు పడ్డారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడికి ఒక్క ముక్క హిందీ రాదు.. తెలుగులో రాసుకొని హిందీలొ చదివాడు అని చెప్పారు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్ట్ అన్నాడు.. ఇప్పుడు గొప్పవాడు మంచివాడు అంటున్నాడు అని ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాలు మోడీని అసహ్యించుకుంటున్నాయని అనాడు అన్నాడు.. ఇప్పుడు మోడీ ప్రపంచానికి ఆదర్శం అంటున్నాడు.. చంద్రబాబు ఊసరవెల్లి లాగా రంగులు మార్చి నిన్నొక్కటి ఇవాళ ఒకటి మాట్లాడుతున్నాడు అని ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పిస్తున్నారు.
రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారే
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమన్నారు. రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు ను నిర్ణయించేది యువత… అ యువతకు ఉద్యొగు, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు మోడీ అని, 10 ఏళ్ళు గడిచిన ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయాడని జీవన్ రెడ్డి విమర్శించారు. పబ్లిక్ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారు, ప్రభుత్వం ఒక్క వ్యాపార సంస్థ ఐపోయిందని ఆయన మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులవుతారు అంటున్నారు, అంబానీ ఆదానిలకు లక్షల కోట్లు మాఫీ చేస్తే సోమరిపోతుల కారా అని ఆయన అన్నారు. రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో వారికి ఘోర పరాజయం తప్పదు..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి అధికార మదంతో కన్నూ మిన్నూ కానకుండా మాట్లాడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియాల పొత్తు లేకుండా పెద్దిరెడ్డి నిలబడగలడా? అని ఆయన ప్రశ్నించారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయం.. టీడీపీ పొత్తులు బహిరంగం.. జగన్ రెడ్డివి చీకటి పొత్తులు.. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదు అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
నేను బలమైన సీఎంని, నీలాగా బలహీన పీఎంని కాదు.. మోడీపై విమర్శలు..
కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్‌లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్ ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై, కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయి..
కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు తల దించుకునేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఈటల గెలవడానికి బీజేపీ బీఅర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈటల గెలవడానికి మల్కాజ్‌గిరిలో బీఅర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల గెలుపు కోసం కేసీఆర్ తురుము ఖాన్ అంటూ పొగుడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ, బీఅర్ఎస్ లు కాదా అని ఆయన ప్రశ్నించారు.