ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్ రెడ్డి ఫైర్..
సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల సభ్యత్వం తెలంగాణలో పూర్తి అయిందన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. సామరస్యంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ బూత్ కమిటీ లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22 న ఢిల్లీలో జరిగే సమావేశంలో మండల, జిల్లా ఎన్నికల తేదీలు ఖరారు అవుతాయని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉంటూ పోరాడాలన్నారు. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుంది.. రెండింటికీ తేడా లేదా? అని ప్రశ్నించారు. అదే అవినీతి, అదే గాలిమాటలు ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటే తెలంగాణకు ఇబ్బంది అని సూచించారు. సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కైలాష్ గహ్లోట్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు.. నో ప్రాబ్లమ్
మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్ బీజేపీలో చేరడంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (సోమవారం) మాట్లాడుతూ.. గహ్లోట్ తన స్వంత నిర్ణయాలు తీసుకోగలరు.. అతను స్వేచ్ఛగా ఉన్నాడు.. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చని అన్నారు. ఇదిలా ఉండగా.. కైలాష్ గహ్లోట్ రాజీనామాపై ఆప్ సీనియర్ నాయకుడు దుర్గేష్ పాఠక్ మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ మంత్రిని ఈడీ, ఆదాయపు పన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా నెలలుగా ప్రశ్నిస్తున్నాయి.. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని వీడారని పేర్కొన్నారు. బీజేపీలో చేరితే.. కేసులు మొత్తం పోయి క్లీన్ చిట్ వస్తుందనే ధీమాతో కైలాష్ పార్టీ ఫిరాయించాడని పాఠక్ ఆరోపించారు.
అంగన్వాడీల ప్రతి సమస్యపై సానుకూలంగా ఉన్నాం.. ఆందోళన వద్దు
అంగన్వాడీల ప్రతి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఆందోళనకు వెళ్లొ్దని సూచించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి.. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది.. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం.. సమ్మెలు, ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవు అంటూ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు..
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేత కైలాశ్ గహ్లోట్ ఈ రోజు (సోమవారం) బీజేపీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పని చేసిన గహ్లోట్ ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు లేఖ పంపారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం తీర్చలేని హామీలు ఇస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు..
తెలంగాణలో యువతకు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఎల్‌బీ నగర్ స్టేడియంలో స్వయంగా నేను నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పుణేలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక సక్సెస్ స్టోరీ లేదన్నారు. ఈ పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని తెలిపారు. ప్రతిసారి బాంబు పేలుళ్లు.. ఇతర కొత్త కొత్త అంశాలను ప్రధానమంత్రి మోదీ.. బీజేపీ ఎన్నికల ముందుకు తెరపైకి తెస్తున్నాయి.. చెప్పుకోవడానికి ఏం లేకనే వాటిపై ఆధారపడుతున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 2002కు ముందే దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చారని తెలిపారు.
తప్పచేస్తే కేసులు పెట్టండి.. దొంగ కేసులు పెడితే ఊరుకోం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవి రెడ్డి మోహిత్ రెడ్డి తదితర నేతలు ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
సత్యం చీకటిలో ఎప్పటికీ దాగదు.. ‘ది సబర్మతి రిపోర్ట్’పై కేంద్రమంత్రి ప్రశంసలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌లో సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రశంసించారు. 2002 నాటి గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా తీసిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా నిజాన్ని ధైర్యంగా బయటపెట్టిందని అన్నారు. “శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఎంత ప్రయత్నించినా, అది సత్యాన్ని చీకటిలో ఎప్పటికీ దాచదు” అని హోం మంత్రి అన్నారు. ” సబర్మతి రిపోర్ట్ చిత్రం అసమానమైన ధైర్యంతో పర్యావరణ వ్యవస్థను ధిక్కరిస్తుంది. విధిలేని ఎపిసోడ్ వెనుక ఉన్న సత్యాన్ని పగటిపూట బహిర్గతం చేస్తుంది” అని ఆయన చెప్పారు.
రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం..
రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్దేశ్వరం – అలుగు ప్రాజెక్ట్‌పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. సిద్దేశ్వరం- అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా పరిశీలన చేసి చేపడతామన్నారు.
హైదరాబాద్‌లో పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్లు STP ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలోకి మల్లిస్తున్న తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్థానికులతో మాట్లాడారు.
శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ఆ స్కీంను మాత్రం కొనసాగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మళ్లిస్తామని తెలిపింది. శ్రీవారి భక్తులకు రెండు మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్యమతస్థ ఉద్యోగులను ప్రభుత్వ శాఖలోకి బదిలీ చేస్తామన్నారు. తిరుమలలో ఉన్న వ్యర్థపదార్థాలను రెండు మూడు నెలల కాలంలో తరలిస్తామని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లై ఓవర్‌కి తిరిగి గరుడ వారధిగా నామకరణం చేశామన్నారు.