NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం!

జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్, హర్యానా అధికారులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించాలా వద్దా? దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఏ శక్తీ కూడా ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన చేయడం లేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు 40 రోజులు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్-అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో 90 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాండురంగ్ మాట్లాడుతూ.. మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం.. ఫుడ్‌ మెనూ.. టైమింగ్స్‌ ఇవే..

బుక్కుడు బువ్వ కోసం ఎవరూ అలమటించకూడదు.. తక్కువ ధరతోనూ అందరికీ టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంకానుండగా.. రేపు వివిధ జిల్లాల్లో మిగత 99 క్యాంటీన్లను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.. ఇక, అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు.. సామాన్యులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

సీతారామ ప్రాజెక్టు ప్రారంభం.. గోదావరి జలాలకు సీఎం ప్రత్యేక పూజలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పంప్‌హౌస్‌-2ను సీఎం రేవంత్‌రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి గోదావరి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టువస్త్రాలు వదిలారు. కాగా, ఈ పథకం కింద దాదాపు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అక్కడి నుంచి అనంతరం వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌస్-3ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. మరోవైపు అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ పంప్ హౌస్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

కూతురుతో పవన్ కల్యాణ్ సెల్ఫీ.. పిక్ వైరల్!

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఎగురవేశారు. ఈ వేడుకలకు పవన్ తన కూతురు ఆద్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన డిప్యూటీ సీఎం తన కుమార్తెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోని చూసిన పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ ఫోటోకి నెట్టింట పెద్ద ఎత్తున షేర్లు, లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్ కుమార్తె ఆద్య. పవన్‌, రేణుల విడాకుల అనంతరం తల్లితో కలిసి ఆద్య ఉంటున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా తండ్రి పవన్‌ వద్దకు ఆమె వస్తుంటారు. పవన్‌కు కుమార్తె ఆద్య అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అలానే కుమారుడు అకీరా నందన్ కూడా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో పవన్ పక్కనే అకీరా ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్‌ తాను చేయాల్సిన మూడు సినిమాలను పక్కన పెట్టి.. పూర్తిగా ఏపీ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. పవర్ స్టార్ త్వరలోనే సెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..

ఏపీలో అన్న క్యాంటీన్ ను సతీసమేతంగా సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. పేదలతో పాటు అన్న క్యాంటీన్ లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పేదలకు చంద్రబాబు దంపతులు భోజనం వడ్డించారు. అలాగే వారితో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందుతున్నాయి.. రాబోయే 23 ఏళ్ళలో సంకల్పం చేసి ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అవుతామన్నారు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్ళం అని ఆయన పేర్కొన్నారు.

తొందర్లోనే స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక రాబోతుంది

తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్‌ఎస్‌ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్‌. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయామన్నారు కేటీఆర్‌. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని, రాష్ట్రం అంతా మోసపోయినా ఘనపూర్ ప్రజలు మాత్రం మోసపోలేదన్నారు కేటీఆర్‌.

ప్రధానితో పారిస్ ఒలింపిక్స్ విజేతల భేటీ..వీడియో వైరల్

పారిస్ ఒలింపిక్ విజేతలు నేడు ప్రధాని మోడీ కలిశారు. జులై 26న ప్రారంభమై ఆగస్టు 11న ముగిసిన విషయం తెలిసిందే. భారత్ నుంచి117 మంది సభ్యుల బృందం పారిస్ వెళ్ళింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు. స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు స్వాగతం పలికారు. ఇప్పుడు ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆగస్టు 15 (గురువారం) కలిశారు. దీనికి సంబంధించిన మొదటి వీడియో బయటపడింది.
ప్రధాని మోడీకి భారత ఆటగాళ్లు బహుమతులు ఇచ్చారు. షూటర్ మను భాకర్ ప్రధానికి పిస్టల్ ఇచ్చింది. రెజ్లర్ అమన్ సెహ్రావత్, హాకీ యోధుడు పీఆర్ శ్రీజేష్ భారత ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీలను అందజేశాడు. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన జట్టు తరపున ప్రధానమంత్రికి హాకీ స్టిక్‌ను బహుకరించాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అయితే ఆటగాళ్లతో ప్రధాని ఏం మాట్లాడారనే వీడియో మాత్రం ఇంకా బయటకు రాలేదు.

అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్య

నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్య.. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం, జిల్లాలో ఒక పరిస్థితి ఉంటే.. సర్వేపల్లి నియోజవర్గంలో పరిస్థితి మరోలా ఉంది అని ఆయన పేర్కొన్నారు. 20 సంవత్సరాల తరవాత గెలిచిన సోమిరెడ్డి ప్రజలకు మంచి చేసే పనులు విస్మరిస్తున్నారు.. సోమిరెడ్డి, ఆయన కొడుకు రెండు సంచులు పట్టుకొని సాయంత్రానికి సంచుల నిండా డబ్బుతో ఇంటికి వెళ్తున్నారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.

మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు..

వక్ఫ్ చట్ట సవరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు.. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదు అని పేర్కొన్నారు. మత గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహారించాల్సింది పోయి సొంత నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరి కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. విలువైన భూములను హస్తగతం చేసుకోవడం కోసం రైల్వే సంస్థ, డిఫెన్స్ ఆస్తుల్లా చేస్తామంటే కుదరదు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి విలువైన భూములను జగన్ ఖాజేయ్యాలని చూశారు అని మంత్రి ఫరూక్ వెల్లడించారు.