NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారం వైసీపీదే..!

మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.. ఇదేనే ప్రభుత్వం పనితీరు..? అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో నెలరోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు.. అధికార పార్టీ పతనం స్టార్ట్ అయ్యిందన్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లేడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని ఆరోపించారు.. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.. నా మీద కుట్రలు బయటపెడతాను… విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా వుంటుందో చేసి చూపిస్తాను అని వార్నింగ్‌ ఇచ్చారు..

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి ఐఎండీ ఐదు రోజుల పాటు వర్ష సూచన వెల్లడించింది. దీంతో నేడు తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఈ నెల 25వ తేది వరకు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని పేర్కొంది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు.. లింక్ ఇదే..

రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులకు చేరేలా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. నేటి (సోమవారం) నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఆల్ లైన్ లింక్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీ కేటాయించారు. వారి వద్దకు వెళితే సీఎంఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేషెంట్ల వివరాలు నమోదు చేయనున్నారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవేనా? కాదా అనే వివరాలను తెలుసుకోవడానికి పోర్టల్‌లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా సీఎంఆర్‌ఎఫ్‌ను పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.

ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పని చేశాం.. కీలక శాఖలతో బాధ్యత పెరిగింది..

గతంలో ఒక్కస్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం.. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములం అయ్యాం.. కీలక శాఖలు తీసుకున్నాం.. బాధ్యత పెరిగిందన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారు. జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ అనేది దేశంలో ఓ కేస్ స్టడీ అయ్యిందన్నారు. జనసేన విజయం గొప్ప విజయం. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు. ఒక్క స్థానం లేకున్నా.. పట్టుదలతో పని చేశామని గుర్తుచేసుకున్నారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు.. కానీ, 164 రావడానికి జవసేన వెన్నెముకగా మారిందన్నారు.. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి. వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు. గతంలో సాక్షాత్తూ ఓ ఎంపీనే సీఐడీ కార్యాలయంలో కొట్టారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వం హయాంలో జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చాం అన్నారు.

ప్రధాని మోడీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత వారం హస్తిన పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హేమంత్ పలువురి ప్రముఖులను  కలిశారు. ఇక సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం. హేమంత్ సోరెన్.. తన సతీమణి కల్పనా సోరెన్‌తో కలిసి శనివారం ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కలిశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, ఈడీ, సీబీఐ కేసులపై చర్చకు వచ్చినట్లు వార్తలు వినిపించాయి.

ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం..

రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని హోంమంత్రి వెల్లడించారు.

మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని.. ఈ రెండు అంశాలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారన్నారు. మచ్చుమర్రి ఘటనలో మైనర్లు ఉన్నారని మంత్రి చెప్పారు. ఫోన్లలో అశ్లీల వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తుండటమూ ఈ తరహా ఘటనలకు కారణం అవుతోందన్నారు. క్రిమినల్‌కు పార్టీ, క్యాస్ట్ ఉండదు.. వారికి శిక్ష పడాల్సిందేనని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్

హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ని పోలీసులు బట్టబయలు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర సుమారు 200 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్వోటీ పోలీసులు, రాజేంద్రనగర్ డివిజన్ పోలీసులు మొత్తంగా మూడు పోలీస్ టీమ్స్ కలిసి చేసిన ఉమ్మడి ఆపరేషన్ లో భాగంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నైజీరియన్లను అరెస్టు చేశారు. పలువురు విఐపిలకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. ఐదుగురు నైజీరియన్ ల వద్ద కొకైన్ కొనుగోలు చేసిన ఐదుగురు వీఐపీలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

రైతులకు గుడ్‌న్యూస్‌.. రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది.

మరో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్‌ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.

సుప్రీం కోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

కేసీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. సుప్రీంకోర్టులో ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. జస్టిస్ నర్సింహారెడ్డి రెడ్డి కమిషన్ సమన్ల పై జూలై 1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాలు చేశారు కేసీఆర్. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.