NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదు..

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత.. ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజ్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించింది కూడా తామేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. సమగ్ర సర్వే చేసి సభలో పెట్టేంత ధైర్యం కూడా చేయలేదని విమర్శించారు. పబ్లిక్ డొమైన్‌లో కూడా పెట్టలేదు.. మీరు బీసీలకు వ్యతిరేకం అందుకే పట్టించుకోలేదు.. మీ సర్వే పబ్లిక్ డొమైన్‌లోనే పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంఖ్య 6 శాతం పెరిగింది.. మీరు సర్వే చేశాం అని చెప్తున్న దాంట్లో కంటే బీసీ సంఖ్య పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.. సర్వేలో మీరే పాల్గొనలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఇంకా ఎవరైనా సర్వేలో పాల్గొనక పోతే మళ్ళీ గడువు ఇచ్చామని అన్నారు.

త్రిభాషా పాలసీ కొత్తది కాదు.. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదు

తమిళనాడులో త్రిభాషా వివాదం రగులుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి చిహ్నాన్ని స్టాలిన్ ప్రభుత్వం తొలగించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా పాలసీ కొత్తది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటీ నుంచి ఈ విధానం కొనసాగుతుందని అన్నారు. నచ్చిన భాషలో చదువుకోవచ్చు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు..

శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. జయజయహే తెలంగాణాకు ఆంధ్ర వ్యక్తి ఎం.ఎం కీరవాణి సంగీతం ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం అవుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లికి దండ వేయని వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహ రూపం రూపొందించారని దుయ్యబట్టారు. తెలంగాణ విగ్రహ రూపం మార్చడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ, బోనాలు ఆ రెండూ లేకుండా విగ్రహం రూపొందించారని ఆగ్రహ వ్యక్తం చేశారు. మరోవైపు.. 2.64 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది అంటే అందులో కాళేశ్వరం పాత్ర కూడా ఉందని వెల్లడించారు. మేడిగడ్డను బూచిగా చూపించారు.. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. పంటలను గొర్రెలు, పశువులు మేస్తున్నాయని కవిత పేర్కొన్నారు. సూటు బూటు వేసుకుని ఉద్యోగం చేయడమే కాదు.. గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుని ఉపాధి పొందడం కూడా ఉపాధేనని తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ మోసపూరితం.. పవన్ ప్రసంగం విచిత్రంగా ఉంది..!

ఓ వైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం.. మరోవైపు.. జనసేన అవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విశాఖలోని కుర్మన్నపాలెం దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు.. వీఆర్ఎస్‌ పేరుతో కార్మికులను బయటకు పంపుతున్నారు.. కాంట్రాక్టు కార్మికులను తీసేస్తున్నారు.. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారని మండిపడ్డారు.. ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ది జరగదన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు, సెయిల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందన్నారు.. ఎన్‌ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ తీసుకోవాల్సిన పరిస్థితి… రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి.. దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలనుకోవడమే అని ఆరోపించారు.. స్టీల్ ప్లాంట్ భూములను కోళ్లగొట్టాలని ఆదాని లాంటి వాళ్లు కాపుకాసి వున్నారు.. కార్మికులందరు ఐక్యతగా ఉండాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి… స్టీల్ ప్లాంట్ ను కాపాడు కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి.. దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలని కోరారు..

కేసీఆర్ సభకు రండి.. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బతుకమ్మ చీరలు సూరత్‌లో తెచ్చారు.. కమిషన్లు మింగి దోపిడీకి పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. మరోవైపు.. స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు మంచి చీరలు ఇస్తామని.. కోఠి ముప్పై లక్షల చీరలు చేనేతకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. ఆడబిడ్డలకు తమకు అత్మ బంధం ఉందని అన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఏదైనా యూనివర్సిటీ వెళ్ళారా..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులను వీసీలను పెట్టిండు కానీ.. ఓయూయూనివర్సిటీకి ఎప్పుడైనా దళితుడిని వీసీ చేశారా..? అని దుయ్యబట్టారు.

హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతా.. సోషల్‌ మీడియా పోస్టులపై సీఎం ఫైర్

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రసంగంలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులపై కన్నెర్రజేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సోషల్‌ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా.. కాదు అంటే.. ఒక్కడు బయట తిరగలేడు.. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా?.. హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు.. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి.. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతా. తొడ్కలు తిస్త. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చర్యలకు గ్రీన్ సిగ్నల్.. ఇకపై ట్రోల్స్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారు

ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్‌లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారని కొనియాడారు. ఈ 15 నెలల్లో తాము చేసిన అప్పు 4500కోట్లే అని స్పష్టం చేశారు. రేపట్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పారు. సోషల్ మీడియా పేరుతో అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తనను ట్రోల్ చేశారని తెలిపారు.

బెట్టింగ్ యాప్‌లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఇటీవల ఏపీకి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌పై నమోదైన కేసుల్లో సజ్జనార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై కూడా దృష్టి సారించారు.

47 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా ఆయ‌న పారిశుద్ధ్య కార్మికుల‌తో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా, మొత్తంగా 14 ఏళ్ళకు పైగా సీఎంగా ఉన్నా. పదేళ్ళు ప్రతిపక్ష నేతగా చేశాను. ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, తెలుగువారికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పం నాది.” అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.