NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..

దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకి హాజరయ్యారు. అయితే, ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆంమె అలెర్జీతో బాధపడుతున్నారు. అయినప్పటికీ గంగా నదిలో పవిత్ర స్నానం చేసే ఆచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద గిరి మంగళవారం మాట్లాడుతూ.. ఆమె పవిత్రస్నానంలో పాల్గొంటారని, శిబిర్‌లో విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. ఆమెకు కొన్ని అలెర్జీలు ఉన్నాయి. ‘‘ఆమె ఎప్పుడూ ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లలేదు. ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది. పూజ సమయంలో ఆమె మాతోనే ఉంటుంది’’ అని అతను చెప్పాడు.

పట్టాలు తప్పిన రైలు కోచ్‌లు.. తప్పిన పెను ప్రమాదం..

తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఫుల్‌ డిమాండ్.. కోడి పందాల బరుల దగ్గర ఓడిన పుంజుల కోసం క్యూ..!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచిన ఓడిన కోడిపుంజుకున్నా డిమాండే వేరు. ఓడిపోయిన కోడి కోస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ఫ్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు.. గనుక వీటి మాంసం టేస్టే వేరు.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లుకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు. ఇక, ఏనుగు చచ్చిన బతికిన వేయ అన్నట్టుగా పందెం పుంజు పరిస్థితి తయారయింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే కోడిపందాల బరిలో గెలిచిన పుంజు పందెం రాయుళ్లను సంతోష పెడుతుంటే.. ఓడిన పుంజు భోజన ప్రియుల మనసు గెలుచుకుంటుంది.

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా స్టార్ట్ అయింది. ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తాజాగా, వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ట్రై చేస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీని వల్ల ఒక మహిళ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రమాదం బారినపడ్డారు. అయితే, వారు రైలు ఢీకొనకుండా తృటిలో తప్పించుకున్నారు. వారిని ఇతర ప్యాసింజర్లు కాపాడారు. విషయం తెలుసుకుని సంఘటన ప్రదేశానికి వచ్చిన రైల్వే అధికారులు పరిస్థితులను చక్కదిద్దారు.

రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి.. బుద్ధా వెంకన్న సవాల్

నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తాను, బోండా ఉమా మాచర్ల వెళ్ళామని చెప్పారు.

కోనసీమను మించేలా పులివెందులలో మొదటిసారి కోడి పందాలు..

కోనసీమను మించేలా పులివెందులలో మొట్టమొదటిసారిగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తాము కూడా తగ్గేదేలే అంటూ బరులు గీసి పందాలకు తెర లేపారు అక్కడి రాజకీయ నేతలు… మొట్టమొదటిసారిగా పులివెందుల చరిత్రలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోనసీమకు తామేమి తీసుకోమని టెంట్లు వేసి బరులు గీసి జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇదే తంతు కొనసాగుతోంది. ఇంత జరుగుతున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు కోనసీమ జిల్లాల్లో జరిగే కోడి పందాల శిబిరాల్లో మహిళలు అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. పందాలకు సై అంటున్నారు. తగ్గేదే లేదంటూ లక్షల్లో పందాలు కడుతున్నారు. పందెం రాయుళ్లుతో సమానంగా కోడిపందాలు చూడటానికి వచ్చిన మహిళల్లో ఎక్కువ మందే పందాలు వేస్తున్నారు.

రేపు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది , జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టు కోర్ట్ హాల్‌లో 37వ నెంబర్‌గా లిస్ట్ చేయబడింది.

ఇకపోతే, కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి, హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని కోరింది. కేటీఆర్ పిటిషన్‌కు సంబంధించిన విచారణ , ప్రభుత్వ వాదనలు రేపు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి.

పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ సంపూర్ణం కాదు.. రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్(పీఓకే)పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కృషిని రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ, కాశ్మీర్‌లను సమానం చూస్తుందని చెప్పారు. అఖ్నూర్ సెక్టార్‌లోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్‌లో 9వ సాయుధ దళాల మాజీ సైనికులు దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

‘‘గత ప్రభుత్వాలు కాశ్మీర్‌ని భిన్నంగా చూశాయి. ఫలితంగా ఈ ప్రాంతంలోని మన సోదరులు, సోదరీమణులను దేశంతో కలపలేకపోయారు. మా ప్రభుత్వం కాశ్మీర్ ,దేశంలోని మిగత ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది’’ అని అన్నారు. ఈ దిశగా సరైన చర్యలు తీసుకున్న సీఎం ఒమర్ అబ్దుల్లా అని ప్రశంసించారు.

నార్సింగ్ పుప్పాల్‌గూడలో జంట దారుణ హత్య

సంక్రాంతి పండుగ వేళ నార్సింగి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనతో నార్సింగి పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం రేగింది. సంక్రాంతి సందర్భంగా పలు చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగురుతుండగా, అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి వెళ్లిన యువకులు అక్కడ రెండు మృతదేహాలను చూసి భయంతో వణికిపోయారు.

కౌశిక్‌రెడ్డిని కేసీఆర్ అదుపులో ఉంచాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని, కేటీఆర్ మరియు కేసీఆర్ మెప్పుకోసమే కౌశిక్‌రెడ్డి ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

 

Show comments