NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు అఖండ దీపం వెలిగించి, జ్యోతి ప్రజ్వలన చేసి సంకల్పాన్ని ప్రారంభించారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించినప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా కొండపై ఉన్న పుష్కరిణిలో స్నానాలు చేయడం నిషేధించారు. అప్పటి నుంచి కొండ కింద ఏర్పాటు చేసిన లక్ష్మీ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. కొండ కింద స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతుండటంతో విష్ణు పుష్కరిణిని మళ్లీ ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

మా ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు.. యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఖైదీల శిక్షలో సడలింపు విషయంలో యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. నిజానికి చాలా మంది ఖైదీల బెయిల్ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోర్టు పేర్కొంది. ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తుల పరిష్కారానికి కోర్టు కాల పరిమితిని విధించింది. దీనిని యుపి ప్రభుత్వం అనుసరించలేదు. దీని కారణంగా కోర్టు రాష్ట్రాన్ని మందలించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు క్షమాపణలు చెప్పింది. కానీ కోర్టు క్షమాపణలను తిరస్కరించింది. మా ఆర్డర్‌ను ఆమోదించిన తర్వాత కూడా మీరు 2-4 నెలలు ఎలా తీసుకుంటారని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఎజి మసీహ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఖైదీల హక్కులకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. నేరస్తుల ప్రాథమిక హక్కులతో ఆటలాడుతున్నారు. కోర్టు ప్రకటనపై యూపీ తరపు న్యాయవాది రాకేష్ కుమార్ స్పందిస్తూ.. అధికారులు సెలవులో ఉన్నారని తెలిపారు. దానికి సుప్రీంకోర్టు స్పందిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి సచివాలయం ఫైల్‌ను ఆమోదించలేదని.. అధికారుల పేర్లను ముందుకు తీసుకురాలేదని అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.

ప్రస్తుతానికి అరెస్ట్ చేయవద్దు.. పూజా ఖేద్కర్‌ కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం..

మహారాష్ట్ర కేడర్‌ నుంచి తొలగించబడిన ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్‌ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC ఫిర్యాదు తర్వాత, పూజా ఖేద్కర్‌ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖేద్కర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను దాఖలు చేశారు.

కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది..

కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహక సమావేశం పేరిట హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అభివృద్ధి ని తాము చేసినట్లుగా ఈ ప్రభుత్వం చూపించు కునే ప్రయత్నం చేస్తోందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని.. ప్రాజెక్టు నే తాము కట్టినట్లు కటింగ్ ఇస్తున్నారు.

కొండపైకి ఆ సమయంలో బైక్స్‌కు నో ఎంట్రీ.. జాగ్రత్త సుమీ..

మరోసారి తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ అధికారులు ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత రెండు నెలల నుంచి తిరుమలలో చిరుతలు తిరుగుతూ కలకలం రేపిన సంఘటనలు చాలానే చూసాము. అయితే జంతువులు బ్రీడింగ్ సమయం కావడంతో.. తరచూ నడక మార్గాన్ని., అలాగే మొదటి ఘాట్ రోడ్డు దాటుతూ భక్తుల్లో చిరుతలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్న ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నేటి నుంచే అంటే ఆగస్టు 12 సోమవారం నుండి అమల్లోకి రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. మామూలుగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుండి రాత్రి పది గంటల వరకు ద్విచక్ర వాహన రాగబోకులకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని కాస్త టీటీడీ తెలిపింది. ఆదివారం నాడు రాత్రి 9 గంటల సమయంలో 54వ క్రాస్ వద్ద చిరుత కనిపించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..

గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ధాన్యం సొమ్మును సంబంధించిన మొత్తానికి సంబంధించిన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టింది.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పండించిన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.. రైతులను గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశాం అన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో అధికారులతో సమీక్షించిన సమయంలో అనేక అక్రమాలు బయట పడ్డాయి.. ఎన్ని కష్టాలు ఎదురైన రైతులకు బకాయిలు చెల్లించాలని నిర్ణయించుకున్నాం… గత ప్రభుత్వం చేసిన అరాచకంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.. కానీ, 674 కోట్ల రూపాయలు చెల్లింపులతో రైతుల్లో భరోసా కల్పిస్తుందన్నారు. గత ఐదేళ్లలో మీరు పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు అన్నారు.

హర్ ఘర్ తిరంగా.. మనందరి బాధ్యత.!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య పండుగ సందర్భంగా 23 కోట్ల మంది భారతీయులు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారని, రేపటి స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ స్ఫూర్తిని కొనసాగించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి.. ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్‌ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామని డీజీపీ ద్వారక తిరుమల రావు స్పష్టం చేశారు.

నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలి

కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే… రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని ఆయన మండిపడ్డారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పని చేస్తే తప్పుపడతారా? అని ఆయన బండి సంజయ్‌ అన్నారు.

క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదు.. మరి ఎప్పుడంటే?

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక మంత్రి ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 53రోజులు ఇదే రాజమండ్రి జైలులో ఉంచారు. ఎలాంటి తప్పు చేయకుండా చంద్రబాబును జైలులో పెట్టారని నాటి పరిస్థితి గుర్తు చేసుకొని ఆవేదన చెందారు. ఇవాళ పరిస్థితులు తారు మారయ్యాయని.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ఖైదీలు విడుదల ఉంటుందని అన్నారు. కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉన్న కారణంగా కొంత సమయం ఆలస్యం అవుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.