NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పోటీ చేయాలా, వద్దా అనేది త్వరలో చెబుతాం: తలసాని

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది.

మెగాస్టార్‌కి శ్యామల కౌంటర్‌.. వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా..?

నాకు మనవడు కావాలి అంటూ మెగాస్టార్‌ చిరంజీవి తన మనసులో కోరిక బయటపెట్టారు.. ఇంట్లో నా గ్రాండ్ డాటర్స్ అందరితో ఉంటే ఒక లేడీ హాస్టల్ లాగా ఉంటుంది.. వాళ్లకు నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తానన్న చిరు.. అలాగే ఈ సారైనా చరణ్ ని మగపిల్లాడిని కనమని చెప్పినట్టు, లెగసి కంటిన్యూ అవ్వాలని కోరిక అని చెప్పుకొచ్చారు.. ఇదే సమయంలో మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమో భయం అని వ్యాఖ్యానించారు చిరంజీవి.. అయితే, మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా? అని ప్రశ్నించారు.. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు. వారసుడు అనేవాళ్లు కొడుకు అనే ఉద్దేశ్యంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందన్నారు.. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని.. ఉపాసన అన్నీ వ్యాపారాలు చక్కగా నడుతున్నారన్నారు.. వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు శ్యామల..

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ.. జగన్‌ సంచలన వ్యాఖ్యలు

వరుసగా వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవని.. హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందని ఆరోపించారు.. ప్రజలు కాలర్‌ పట్టుకునే పరిస్థితి వచ్చింది.. రాష్ట్రంలో స్కాంలు తప్ప ఏమీ జరగడంలేదు.. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఏమీ లేదు.. ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాంలు చేస్తున్నారు.. యథేచ్ఛగా పేకా క్లబ్బులు నడుస్తున్నాయి.. తీవ్రవాదులుపెట్టే కేసులు పెట్టి వేధించి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.. అయితే, చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్‌ ఇచ్చారు.. తప్పు చేసినవారిని చట్టంముదు నిలబెడతామని ప్రకటించారు.

64 మందిని అరెస్ట్ చేశాం.. సొంత కార్లలో కోళ్లను తీసుకొచ్చారు: డీసీపీ

హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడిపందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సైన్స్‌కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు.. వైద్య ఖర్చులు తగ్గాలి..

గుంటూరులో కిమ్స్‌ శిఖర హాస్పిటల్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. సైన్స్‌కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అన్నారు.. 2000 సంవత్సరంలో నెల్లూరులో మొదటి హాస్పిటల్ నేనే ప్రారంభించాను.. 25 సంవత్సరాలలో 25 వేల కోట్ల టర్నోవర్ సాధించన హాస్పిటల్ గా కిమ్స్ హాస్పిటల్ రూపాంతరం చెందింది.. 5000 పడకల హాస్పిటల్ చైన్ గా కిమ్స్ తయారు అయ్యింది అని ప్రశంసలు కురిపించారు.. ప్రజల ఆరోగ్యం కోసం వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు.. టెక్నాలజీ భవిష్యత్ ను మారుస్తుందని 95 లోనే చెప్పాను.. మళ్లీ చెప్తున్నా, రాబోయే కాలాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ శాసిస్తుంది… మన ఆస్తి ఎంత అని కాదు.. మన దగ్గర ఎంత డేటా ఉందని ఆలోచించాలి.. సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు… టెక్నాలజీతో సామాన్య వైద్యులు కూడా అద్భుతంగా ఆపరేషన్ లు చేయవచ్చు అని సూచించారు.

ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది!

ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్‌కు రావాలి అనుకొని కూడా రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారఅని రాహుల్ రాలేదన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం అని హెచ్చరించారు. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోందని, ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్లో మహిళల సత్తా చాటుతాం అని కవిత పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో రోజూ ఒక లొల్లి జరుగుతుంది. ఈరోజు ఉదయం శివాలయంలో జరిగిన విషయంపై మళ్ళీ గొడవ మొదలైంది. శాంతి భద్రతల మీద ఈ ప్రభుత్వంకు ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ మొదటి వరుసలో ఉంటుంది. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలచే హామీలు ఇప్పించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్‌కు రావాలనుకొని కూడా రాలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారని రాహుల్ రాలేదు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోంది. ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్లో మహిళల సత్తా చాటుదాం’ అని పిలునిచ్చారు.

రైతులకు సర్కార్ శుభవార్త.. వారికి రైతు భరోసా నిధులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా.. ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఒక ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹1,126 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే.

నోటాపై రాజకీయ పార్టీల మిశ్రమ స్పందన

స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్ద అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది… కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా BRS పార్టీ స్వాగతించింది… బీజేపీ మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కి ఆ అధికారం లేదని.. రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పింది…సిపిఎం నోటా ఉండాలని… కానీ అభ్యర్థిగా గుర్తించోద్దని స్పష్టం చేసింది… గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లతో రాష్ర్ట ఎన్నికల సంఘం భేటీ అయింది… ట్రయల్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటా ను కూడా ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టాల వద్దా అనే అంశం రాజకీయ పార్టీ ల అభిప్రాయం తీసుకుంది…. రాజకీయ పార్టీ ల ముందు రాష్ర్ట ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పెట్టింది…

అలర్ట్.. గ్రూప్-2 పరీక్ష హాల్ టికెట్లు విడుదల

ఈనెల 23న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC ) హాల్ టికెట్లు విడుదల చేసింది. psc.ap.gov.in. సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. 23న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు పరీక్ష జరగనుంది. కాగా.. పరీక్షా కేంద్రాలకు కేవలం హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలని.. వేరే వస్తువులను ఏమీ తీసుకురావొద్దని ఏపీపీఎస్సీ సూచించింది.

జీహెచ్ఎంసీ రాజకీయాల్లో ఉత్కంఠ.. మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం?

జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డిలపై అవిశ్వాస తీర్మానం దాఖలవ్వొచ్చనే ఉహాగానాలు రాజుకుంటున్నాయి. పాలక మండలి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్ట్రాటజీలు రచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు. నెంబర్ గేమ్ ఆధారంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.