హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ..
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. గురువారం భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. ఎస్,ఆర్.నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మలక్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతటా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ ప్రకారం రాత్రి వరకు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే నిన్నటి భారీ వర్షం కంటే తీవ్రత తక్కువగా ఉంటుందని, అయితే జూన్ 7న నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం
రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలిక వాయిదా పడింది. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసినందున తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం రేపు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.
చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లి మైదానంలో విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చేప ప్రసాదం అందించనున్నారు. అయితే.. మృగశిరకార్తె ప్రారంభం కానున్నందున ఈనెల 8వ తేదీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపల ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చేపమందు ఆస్తమా రోగులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు…మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేస్తారు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం ముందురోజు రాత్రి వచ్చి క్యూలో వేచి ఉన్నారు.
టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఉత్తర్వులు నిలిపివేత
టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఎన్నికలకు ముందు మొత్తంగా 1,800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి.. అయితే, పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయా.. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగాలు కూడా వచ్చిన నేపథ్యంలో.. మొత్తంగా బదిలీలనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ.
తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై బీజేపీ పనిచేస్తుంది..
బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమే అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ ఉనికిని కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని తెలిపారు. 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ తప్ప మిగిలిన చోట్ల మూడో, నాలుగో స్థానానికి పడిపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి ఓట్లు తగ్గాయన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుందన్నారు. విద్యావంతులు, కవులు, ఉద్యమకారుల ఆకాంక్ష కూడా ఇదే అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మేం 8 చోట్ల గెలిచామన్నారు. మరో 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాంగా నిలిచామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో మా పార్టీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారని అన్నారు.
సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్‌రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీడీపీ కూటమి.. ఇక, అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్‌చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి. ఇక, సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..
సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఇక 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్రపక్షాలతో కలిసి ఎన్‌డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన సాగనుంది. జూన్ 9వ తేదీన మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎన్డీయే కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
రాహుల్ గాంధీ నిజమైన యోధుడు..
లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి దగ్గరలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆగిపోవడంపై ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి సీతక్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీడియా కళ్లకు గంతలు కట్టుకుందని, దేశంలో వాస్తవంగా జరుగుతున్నదేంటో నిజంగా చూపించి ఉంటే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి ఉండేదని అన్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఓ యోధుడని కొనియాడారు. అహంకారంతో వ్యవహరించే షెహన్‌షా(రాజు)ను మోకాళ్లపై కూర్చోబెట్టారని మోదీని ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొన్నారు. తామంతా రాహుల్ వెంటే ఉన్నామని తెలిపారు. దేశం కోసం పోరాటం కొనసాగిద్దామని సీతక్క పేర్కొన్నారు.
ప్రజా తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని.. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు. స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవస్థలకు ఆతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దన్నారు. మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.
రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రామచంద్ర నాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.