నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి.. ఎమ్మెల్యే సౌమ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
అనేక ట్విస్టుల నడుమ నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. నిన్నే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించడంతో ఆమెను కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో మాట్లాడి అధిష్టానం సూచించిన వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోవాలని చెప్పడంతో ఎమ్మెల్యే కూడా అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు..
ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి రిఫరెన్స్ అవుతుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే ఈ గణన చేపట్టిందని, 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో, ఎవరు చేసినారో తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తోంది.. త్వరలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆదాయార్జన వాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రీసోర్స్ మొబలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు.. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.. జీఎస్టీ వసూళ్లపై ఆరా తీయడంతో పాటు.. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది.. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీలు అమలు చేస్తూనే.. ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా చెబుతున్నారు..
నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి లావణ్య
రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసారు. మస్తాన్ సాయి ఆగడాలు, యువతులను బ్లాక్ మెయిల్ చేసిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. హార్డ్ డిస్క్ లో మరికొందరి యంగ్ హీరోలకు చెందిన వారి వ్యక్తిగత వీడియోలు ఉన్నాయనే వ్యహహారం సంచలనంగా మారింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి వెళ్ళిన లావణ్య మస్తాన్ సాయి కేసులో డ్రగ్స్ కోణాన్ని బయటపెట్టి పలు ఆధారాలు పోలీసులకు అందజేసింది. అలాగే బిగ్ బాస్ ఫేం RJ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసింది లావణ్య.
కులగణనపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన..
కులగణన సర్వే-2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారం సేకరించాం.. మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే చేశామని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు-17.43 శాతం, ఎస్టీలు- 10.45 శాతం, బీసీలు- 46.25శాతం, ముస్లీం మైనార్టీల్లో బీసీలు- 10.08 శాతం, ముస్లీం మైనార్టీలు కలుపుకుని బీసీలు- 56 శాతం, రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు- 15.79 శాతం ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
సెక్రటేరియట్ వద్ద ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు దిగాడు సదర్ వ్యక్తి. అయితే.. మూడు రోజుల నుంచి లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అధికారులకు ఫోన్ చేస్తున్నాడు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు దిగాడు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించారు ఎస్పీఎఫ్ పోలీసులు. అయితే.. పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో ఫోన్ చేసిన వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ విరుచుకుపడుతోంది. చైనా దళాలు భారతదేశంలోకి చొచ్చుకువచ్చాయని, ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఆహ్వానం కోసం ప్రధాని మోడీ, జైశంకర్‌ని యూఎస్‌కి పంపించారంటూ సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడటం వివాదాస్పదమైంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు రుజువులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పై ఘోర ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతున్న మల్లన్న జాతరను తిలకించేందుకు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన నలుగురు యువకులు కారులో బయలుదేరారు. అయితే, ప్రయాణానికి కొద్దిసేపటికే పోచారం సమీపంలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పైకి చేరుకునే సరికి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యువకులు కారును వెంటనే పక్కకు నిలిపి, గట్టిగా పరుగులు తీశారు. క్షణాల్లోనే మంటలు కారును పూర్తిగా కబళించాయి. అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణించిన నలుగురికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు..
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన సర్వేపై బీఆర్ఎస్ కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు అన్యాయం చేసేలా సర్వే రూపొందించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుషించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సర్వే కోసం 57 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, దీనివల్ల అనేక మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేకపోయారని తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొనలేదని పేర్కొన్నారు. ఇది ప్రజల్లో అసంతృప్తిని కలిగించే అంశమని విమర్శించారు.
భూకబ్జాలపై టాస్క్ఫోర్స్ వేసి కఠిన చర్యలు తీసుకుంటాం..
కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఎక్కడికెళ్లినా సమస్యలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగింది.. గతంలో పులివెందులకు నీళ్లు లేని పరిస్థితి ఉండేది.. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నీటి ప్రాజెక్టుల పనులు ఇప్పుడు చేపడుతున్నాం.. భూ కబ్జాలు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టం అని తేల్చి చెప్పారు. భూకబ్జాలపై టాస్క్ ఫోర్స్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉంది సమీక్షించి సమస్య లేకుండా చేస్తాం.. పాఠశాలలను కబ్జా చేసి వాటర్ ప్లాంట్లను నిర్మించి.. వాటిని తొలగిస్తామన్నారు. అన్ని సమస్యలపై జిల్లా రివ్యూ మీటింగ్ లో చర్చించాం అని మంత్రి సవిత పేర్కొన్నారు.