కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత హనుమంతు రావు రియాక్షన్..
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. “తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులిచ్చిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వలేదు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు కూడా నిధులు ఇవ్వబోమని ఓ నేత అంటున్నారు. ఇది ఈనాటి పథకం కాదు. ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న పథకం. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి. గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలపై ఇలాంటి వివక్ష చూపలేదు.” అని పేర్కొన్నారు.
బడ్జెట్ ఆనందం, ఆశ్చర్యకరమైంది.. బడ్జెట్ పై బొత్స వ్యాఖ్యలు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగిందని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో గురజాడ కవితను ప్రస్తావించడం ఆనందకరమైతే.. ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస కేటాయింపులు లేక పోవడం బాధాకరం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం సహజం. బీహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి కనీస ప్రాధాన్యత దక్కలేదు.. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత కాదని తేలిపోయింది.. పోలవరం ఎత్తు తగ్గించేసి నిధులు కేటాయించామని చెప్పడం దారుణం..2014 -19 మధ్య ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది.. ప్రత్యేక హోదాను ప్రాకేజ్‌గా మార్చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి.. పోలవరం ఎత్తు తగ్గడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుంది.. పోలవరం ఎత్తు కుదింపు పై ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి..” అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
ఎన్నికల కమిషనర్‌ని కలిసిన వైసీపీ నేతలు..
విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు.. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.. ఎన్నికలలో అక్రమ పద్ధతుల్లో టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులను బెదిరింపులకు గురిచేస్తూ వారి నివాసాలను కూలదిస్తున్నారన్నారు.. ఫ్యాన్ గుర్తుపై వైసీపీ తరఫున పోటీ చేసిన వారిని లాక్కోవాలని చూడటం అప్రజాస్వామికమన్నారు.. బయటకు వెళ్లి దొడ్డిదారిన సహరించాలనుకుంటే పార్టీ విప్ జారీ చేశామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.. ఆ మేరకు ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం అందించారు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్యెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ లు ఉన్నారు..
బీజేపీ గెలుపు…ఢిల్లీకి మలుపు.. ఆప్ నేతలు అవినీతికి ఆనవాళ్లు
అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రూ.28 వేల400 కోట్ల జల్ బోర్డ్ కుంభకోణం, రూ.4,500 కోట్ల బస్సుల కొనుగోలు కుంభకోణం, బస్సుల్లో సదుపాయాల పేరుతో రూ.500 కోట్ల దుర్వినియోగం, నకిలీ హెల్త్ టెస్టుల ద్వారా కోట్ల రూపాయల అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు…ఢిల్లీ సమగ్ర అభివ్రుద్ధికి మలుపు కాబోతోందన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు (ఆదివారం) ఉదయం బీజేపీ తెలంగాణ కోశాధికారి భండారి శాంతికుమార్, పార్టీ ఢిల్లీ ప్రతినిధి నూనె బాలరాజుతో కలిసి ఈస్ట్ ఢిల్లీ, షాద్రా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో బనియా, బ్రాహ్మణ, వాల్మీకీ సామాజికవర్గ ప్రజలు అధికంగా నివాసముండే ప్రాంతాల్లో బండి సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు.
ముద్రగడ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారు..
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారన్నారు. ముద్రగడ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారని, అక్కడ ఉన్న ఫ్లెక్సీలు చింపి అరాచకమైన పరిస్థితులు సృష్టించారని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని ఎవరని అడిగితే తాను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పారని.. దీంతో దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని స్పష్టమైందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
బీసీ జనాభా 46.25 శాతం.. సామాజిక న్యాయం కోసమే సర్వే
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రవ్యాప్త కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టింది. దాదాపు 50 రోజులపాటు ఈ సర్వే నిరంతరంగా కొనసాగింది.
అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అభినందనలు..
అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని కొనియాడారు. కౌలాలంపూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు బిడ్డ గొంగడి త్రిష 3 వికెట్లు తీయడంతోపాటు అజేయంగా 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన షబ్నమ్ తన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. మీరు సాధించిన విజయం మరెంతో మందికి ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నా.. Jai hind! అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు
గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రభాకర్.. ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్, బాన్సర్లు గాయపడ్డ. స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకన్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకి స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో ప్రభాకర్ బస చేసినట్లు గుర్తించారు. వైజాగ్ జైల్లో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. జైల్లో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ క్రిమినల్ రికార్డున్న పాత నేరస్థుడు. అతనిపై పలు చోరీల కేసులు నమోదయ్యాయి. 2022 మార్చిలో ఏపీలోని అనకాపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకెళ్లిన సమయంలో అతను పోలీసులు గమనించని వేళ తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
విశాఖలో కలకలం రేపుతున్న ముగ్గురు చిన్నారుల అదృశ్యం..
విశాఖపట్నంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేపగుంట ముచ్చమాంబ కాలనీకి చెందిన ఈ చిన్నారులు అదృశ్యం అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 31వ తేదీన తన ముగ్గురు పిల్లలు ఆదిత్య సాహు (9), లక్ష్మీ సాహు (7), గొర్లి గంగోత్రి (9) ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని బాధిత తల్లి గొర్లి గౌరీ చెప్పుకొచ్చారు. అయితే, తల్లి గౌరీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు. ఒడిస్సా బోర్డల్లో చిన్నారులను పెందుర్తి పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ఇంటికి వెళ్ళారా లేక ఎవరయినా తీసుకువెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది. చిన్నారులు ఆదిత్య సాహు, లక్ష్మీ సాహు, గంగోత్రిలను స్టేషన్ కు తీసుకు వస్తున్నారు పోలీసులు.