రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు
కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్-2లో భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలస్‌లో హెచ్‌ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి. నాలుగు ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఒక ఎకరం దాదాపు రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51 కోట్లు పలికింది. గజం సరాసరి రూ. 1.5 లక్షలు పలికింది. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇక, ప్రస్తుతం 10,11,14 ప్లాట్లకు వేలం కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 18.47 ఎకరాలకు వేలం నిర్వహించనున్నారు. వేలం జరుగుతున్న ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉంది. గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు సంపాదించింది. ఫేజ్ 1లో దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ఎకరం అప్‌సెట్ ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈరోజు జరిగే వేలం ద్వారా మరో రూ. 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు
ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది.. హైకోర్టు తీర్పుతో ఆర్ 5 జోన్ జగనన్న లేఅవుట్స్ లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.. అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఈ రోజు వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. అక్కడ యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.. అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్ర..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు విడతలుగా నిర్వహించిన వారాహి విజయయాత్రను విజయవంతం అయ్యింది. దీంతో, మూడో దశకు సిద్ధం అవుతోంది జనసేన పార్టీ.. మూడో విడత వారాహి యాత్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నిర్వహించనున్నారు.. యాత్ర విజయవంతంపై ఈ రోజు విశాఖ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖ సిటీ నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలన్నారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు నాదెండ్ల.. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. అదే. విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు.
పవన్ నన్ను గోకాడు కాబట్టే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్, శాఖ మంత్రి అంబటి రాంబాబు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండిపోతోంది.. పవన్ తాజాగా నటించిన బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర వివాదానికి కారణం కాగా.. అప్పటి వరకు ఓ స్థాయిలో జరిగిన మాటల యుద్ధం.. ఆ తర్వాత చిచ్చు రాజేసింది. పవన్ కల్యాణ్ కావాలనే తనను కించపరిచే విధంగా సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేశారని మండిపడుతున్నారు అంబటి రాంబాబు.. ఇక, ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ఇక, బ్రో సినిమా గురించి నేను మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి..? అంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ చలవ వల్లే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి.. 14 ఏళ్లలో ఒక్క ఎకరాకు కూడా బాబు నీరు ఇవ్వలేదు.. 14 ఏళ్లలో చేయలేని వారు, ఇప్పుడు ఏం చేస్తారు ? అంటూ ధ్వజమెత్తారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశా, పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరానని తెలిపారు. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు.. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీ వేశాం.. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు 2500 కోట్లు ఖర్చు అవుతుంది.. దీనికి చంద్రబాబు కారణం అంటూ ఆరోపించారు.
ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలి.. చిట్‌చాట్‌లో భట్టి కీలక వ్యాఖ్యలు
మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వరదలపై లోతుగా చర్చ చేయాలని బీఏసీ సమావేశంలో కోరామని ఆయన తెలిపారు. భూములు, సింగరేణి, ధరణి, బీసీ సబ్ ప్లాన్‌పై చర్చ చేయాలని డిమాండ్ చేశామన్నారు భట్టి విక్రమార్క. రాజ్యాంగంలో ఆరు నెలలకు సభ పెట్టాలని ఉంది కాబట్టి సభ పెట్టారని.. అది కూడా లేకుంటే సభ పెట్టే వారే కాదని ఆయన తెలిపారు. పని గంటలు కాదు.. పని దినాలు పెంచాలన్నారు. సీఎంతో మాట్లాడి పని దినాలు 20 రోజులకు పెంచాలని స్పీకర్‌ను కోరామన్నారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనేది కాంగ్రెస్‌కు తెలుసన్నారు. ఉచిత విద్యుత్ మీద ఎలా చర్చ చేయాలో తమకు తెలుసన్న భట్టి విక్రమార్క.. రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలన్నారు. పోడు భూములకు ఎంత మందికి పట్టాలు ఇవ్వాలి.. ఎంత మందికి ఇచ్చారు అనేది సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఎక్కడో ఓ చోట కట్టి.. అందరికి ఇచ్చాం అంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్ రాగానే ఈటల రాజేందర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకొని చిరునవ్వుతో పలకరించుకున్నారు. స్వయంగా ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లిన కేటీఆర్ గత సమావేశాల్లో చాలా సేపు మాట్లాడారు. చాలా కాలంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్ కూడా రాలేదు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత సమావేశాల్లో అనూహ్యంగా కేటీఆర్, ఈటల పలకరించడం చర్చనీయాంశమైంది. తాజా సమావేశాల్లోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. ఈటెలకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆయన సతీమణి జమున స్వయంగా వ్యాఖ్యానించడంతో.. తానే స్వయంగా భద్రత కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ బంధం మరింత దృఢమైందని, తాజా సమావేశాల్లో గతం కంటే ఎక్కువ ఆప్యాయంగా మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనమని గులాబీ నేతలు అభిప్రాయపడ్డారు.
కూటమి గురించి కాదు, ఢిల్లీ గురించి ఆలోచించండి.. విపక్ష ఎంపీలకు అమిత్ షా విజ్ఞప్తి
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గురువారం లోక్‌సభలో చర్చిస్తున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సేవల బిల్లును వ్యతిరేకిస్తూ ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతును కోరే ఆప్ ఉద్దేశం పోరాడడమేనని, సేవ చేయడం కాదని ఆయన విమర్శించారు. అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం బదిలీ పోస్టింగ్‌లపై నియంత్రణను కోరుకోవడం వల్ల బిల్లుపై గొడవ జరగలేదని, వారు తమ అవినీతిని దాచాలని, బంగ్లాలోని నిజాలను దాచాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బిల్లుకు ఓటు వేసేటప్పుడు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని ప్రతిపక్ష ఎంపీలను అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ‘తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని ప్రతిపక్ష ఎంపీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను…’ అని ఆయన అన్నారు. భారతదేశ వ్యవస్థాపక పితామహులైన జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సి రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్ వంటి వారు ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాను పొందాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నారని అమిత్ షా పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతూ అమిత్ షా మాట్లాడుతూ “ఢిల్లీకి సంబంధించి ఏదైనా చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం పార్లమెంటుకు అన్ని హక్కులు ఇచ్చింది” అని అన్నారు. దేశ రాజధాని అధికారుల సస్పెన్షన్‌లు, విచారణలు వంటి చర్యలు కేంద్రం నియంత్రణలో ఉంటాయని బిల్లు ప్రతిపాదిస్తోంది.ఆప్ ఈ బిల్లును అధికారాలను కేంద్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాల స్వయంప్రతిపత్తిని అణగదొక్కడానికి ఉద్దేశించిన “అత్యంత అప్రజాస్వామిక” చట్టం అని పేర్కొంది. భారత కూటమి పార్టీలు దీనిని వ్యతిరేకిస్తాయని పేర్కొంది.
ఢిల్లీకి రాష్ట్ర హోదాను నెహ్రూ, అంబేద్కర్ వ్యతిరేకించారు
ఢిల్లీకి రాష్ట్ర హోదాను ఇవ్వడాన్ని మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతోపాటు అప్పటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై చట్టం చేసే సమయంలో ప్రవేశ పెట్టిన బిల్లుపై లోక్‌సభలో అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని హోం మంత్రి అమిత్ షా సూచించారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరుగుతోన్న చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారన్నారు. ‘మీ కూటమిలో ఉన్నారన్న ఒక్క కారణం చేత, ఢిల్లీలో జరుగుతోన్న అవినీతికి మద్దతు పలకొద్దని అన్ని పార్టీలను కోరుతున్నాను. ఎందుకంటే ఈ కూటమి ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.
పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు.. పది అర్హతతో..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పోస్టల్ లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 30041 గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ పోస్ట్ లకు అర్హత కేవలం పదవ తరగతి పాస్ కావడమే. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 23 లోగా ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26 వరకు తమ అప్లికేషన్ లో తప్పొప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేకొనే వాళ్ళు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 వతరగతి పాస్ అయిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అర్హులు. అయతే, వారు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్, స్థానిక భాష కచ్చితంగా చదివి ఉండాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ విమన్, దివ్యాంగులు అప్లికేషన్ ఎటువంటి ఫీజు చెల్లించనక్కర లేదు..
రియల్ ఇన్సిడెంట్స్ తో చైతూ-చందూ సినిమా… అతని జీవితం ఆధారంగానే?
అక్కినేని నాగచైతన్య ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అల్లు అరవింద్, బన్నీవాసుల గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో చైతన్య ఈ సినిమా చేయబోతున్నాడు. కార్తికేయ2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేస్తుండగా త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు, నాగచైతన్య, చందు మొండేటి ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించి వాళ్లు సముద్రంలో తప్పిపోయి పాకిస్తాన్ వెళ్లిన సంఘటనల వివరాలు తెలుసుకున్నారు. నిజానికి ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతుందని చైతన్య జాలరిగా కనిపిస్తాడని ముందే క్లారిటీ ఇచ్చారు. గుజరాత్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు కూడా అప్పట్లో జరిగింది. ఇక తాజాగా ఈ విషయం మీద నాగ చైతన్య మాట్లాడుతూ సుమారు ఆరు నెలల క్రితం చందూ మొండేటి నాకు ఈ కథ చెప్పారని, ఈ కథ స్ఫూర్తి నింపిందని అన్నారు.
అప్పుడు ఫిర్యాదు చేసిన బీజేపీకి పవన్ హీరోయిన్ మద్దతు
బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమకి కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా మళ్ళీ తెలుగు వారిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కొన్నాళ్ల క్రితం ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ చేయగా అందులో ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడ్డారు. అంతేకాదు ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే మీరా చోప్రా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారంలో ఉన్న ఐడీ కార్డు తనది కాదని, ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకం అని పేర్కొంది. అయితే ఒకప్పుడు తన మీద ఫిర్యాదు చేసిన బీజేపీని ఇప్పుడు ఆమె వెనకేసుకు వచ్చింది. ప్రియాంక చోప్రా కజిన్ అయిన ఆమె తాజాగా హర్యానాలో హింసాకాండపై స్పందించారు. అంతేకాక మత ఘర్షణలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ‘నిందించే’ వారిపై ఆమె మండిపడ్డారు. ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల్లో జరుగుతున్న హింసకు కూడా బీజేపీనే కారణమా అని ఆమె ప్రశ్నించారు. గురువారం (ఆగస్టు 3) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మీరా “భారతదేశంలో జరుగుతున్న మత హింసకు బీజేపీని చాలా మంది నిందించడం నాకు అర్థమైంది, నేను అదే వ్యక్తులను అడగాలనుకుంటున్నాను, లండన్‌లో, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ మరియు ఇతర ప్రదేశాలలో జరుగుతున్న మత హింసకు కారణాలు ఏంటి ఇవి కూడా బీజేపీ పాలించే దేశాలేనా?? అని ఆమె ప్రశ్నించింది.