యుద్ధం మొదలైంది.. ఎక్స్‌లో ఖమేనీ కీలక పోస్ట్
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే మంచిదని.. లేదంటే పరిణామాలైతే తీవ్రంగా ఉంటాయని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
చెవిరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: లక్ష్మీ
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన సతీమణి లక్ష్మీ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఏ తప్పు చేయని చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే చెవిరెడ్డి బయటకు వస్తారని లక్ష్మీ పేర్కొన్నారు. సిట్ అధికారులు బెంగళూరులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డుపైనే లక్ష్మీ నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు మరో గర్వకారణం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నేడు ప్రారంభం
సైబర్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు గూగుల్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్‌సిటీ దివ్యశ్రీ భవన్‌లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది భారత్‌లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం విశేషం. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత గూగుల్ మొదలుపెట్టిన రెండో సెంటర్ ఇది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఐదవది కావడం గమనార్హం.
జీ 7 సమ్మిట్‌లో మెలోని-మాక్రాన్ గుసగుసలు.. వీడియో వైరల్
కెనడా వేదికగా జీ 7 సమ్మిట్ జరుగుతోంది. సమావేశంలో అగ్ర నేతలంతా రౌండ్ టేబుల్‌గా సమావేశం అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యారు. నేతలంతా చర్చోపచర్చలు చేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో పక్కపక్కనే కూర్చున్న ఇటలీ ప్రధాని మెలోని-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గుసగుసలాడడం ప్రారంభించారు. ఏదో మేటర్ సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. మాక్రాన్ నోటి దగ్గర చెయి అడ్డుపెట్టుకుని ఏదో చెబుతుంటే.. మెలోని సీరియస్‌గా ఆలకిస్తూ కళ్లు మూశారు. ఎదురుగా ట్రంప్ కూర్చుని ఉండగా ఇదంతా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను వచ్చేశా.. సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ సన్నీ భయ్యా!
యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఉన్నపళంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన బయ్యా సన్నీ.. నెల రోజుల తర్వాత సింహాచలంలో కనిపించాడు. సింహాచలంలో ఫొటోస్ దిగి.. ‘నేను వచ్చేశా’ అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్‌గా పోస్ట్‌లు పెట్టాడు. ‘వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మానాన్నకి ధైర్యం చెబుతా. నువ్వు టెన్షన్ పడకు’ అంటూ మంగళవారం పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బయ్యా సన్నీ యాదవ్ నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వెళ్లి వస్తుండగా.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కోసం సన్నీ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. పాక్‌లో జాకీర్ నాయక్ సమ్మిట్‌కు బయ్యా సన్నీ హాజరయ్యాడు. అయితే బయ్యా సన్నీ నిజంగా ఎన్‌ఐఏ అదుపులో ఉన్నాడా? లేదా? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. బయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా సమాచారం ఇవ్వలేదు.
ట్రంప్-మోడీ మధ్య 35 నిమిషాలు ఫోన్ కాల్.. 5 విషయాలు ప్రస్తావన
ప్రధాని మోడీ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. జీ 7 సమ్మిట్‌లో ఉన్న దేశాధినేతలంతా సమావేశానికి హాజరయ్యారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కూడా కెనడా వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ భేటీ కావల్సి ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య ట్రంప్ అర్థాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. అయితే మంగళవారం రాత్రి ట్రంప్‌తో మోడీ ఫోన్ కాల్‌లో సంభాషించారు. దాదాపు ఇద్దరి మధ్య 35 నిమిషాల పాటు సంభాషణ జరిగినట్లుగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) విషయంలో భారత్ ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని కోరలేదని ట్రంప్‌నకు మోడీ తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ లో జగిత్యాల వాసి మృతి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత రెండేళ్లుగా టెల్ అవీవ్‌లోని ఓ ప్రైవేట్ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న రవీందర్ ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. సుమారు 20 రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురవడంతో టెల్ అవీవ్‌లోని సౌరాస్కీ మెడికల్ సెంటర్‌లో చేర్చారు.
రెంటపాళ్లకు మాజీ సీఎం జగన్.. అడుగడుగునా నీరాజనం!
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో చేరుకోనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైసీపీ అధినేత ఆవిష్కరించనున్నారు. పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజలు జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు గుంటూరు నగరంలో ప్రతిచోటా అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ‘జయహో జగన్’ అంటూ నినదించారు. దాంతో గుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా.. జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం లేదు. జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్‌పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట మీదుగా జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ నిండిపోయాయి. చుట్టుగుంట సెంటర్‌లో జగన్‌కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘన స్వాగతం పలికారు. మొత్తంగా అభిమానులు, కార్యకర్తలతో గుంటూరు రోడ్లు కిటకిటలాడాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. 4200 మంది ఫోన్లు ట్యాప్
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు వెల్లడవుతోంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్ 15 నుండి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారట. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, కోటింరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ లక్ష్యంగా మారాయి.
బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు..
హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో భద్రతా దళాలు హై-అలర్ట్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ బెదిరింపుతో శాంతిభద్రతల సంస్థలు తక్షణమే స్పందించాయి. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) తెలిపిన వివరాల ప్రకారం, ఈ బెదిరింపు తెల్లవారుజామున నివేదించబడింది, ఇది బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను మోహరించడానికి , విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలను నిర్వహించడానికి దారితీసింది. “ఈరోజు ఉదయం బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ అందింది. బాంబ్ స్క్వాడ్‌తో కలిసి ప్రస్తుతం విమానాశ్రయం , దాని ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము. తదుపరి వివరాలు తర్వాత అందిస్తాము,” అని బేగంపేట్ ఏసీపీ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం, విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. ప్రయాణీకులు , సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. తదుపరి సమాచారం కోసం అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.