NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ స్పందించింది. “ఏడు కొండలు వాడా… స్వామి మమ్ముల్ని క్షమించు… భక్తకోటిని క్షమించండి. నీ దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించు.” అని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరింది.

ఈ ఘటనకు వాళ్ల వైఫల్యమే కారణం.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఛైర్మన్ శ్యామల రావు అన్నారు. కాగా.. మృతులు విశాఖకు చెందిన జి. రజనీ(47), లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడు బాబుగా గుర్తించారు.

ఏసీబీ కార్యాలయంకు వెళ్లేముందు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసును రాష్ట్రానికి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించామని తెలిపారు.

తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఇన్నోవేషన్, రీసెర్చ్, , తయారీ రంగాల్లో పెట్టుబడులు అందించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ-మొబిలిటీ వీక్ సందర్భంగా రాష్ట్రం రూ.12,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగిందని తెలిపారు. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగిన ఘన విజయమని అభిప్రాయపడ్డారు.

అన్ని ఏర్పాట్లు చేశాం.. కానీ..

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి టీటీడీ తోపాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని… అయినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో మార్చురీని ఆయన వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామని కలెక్టర్ వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 2 వేల 400 మంది భక్తులు ఉన్నారని… ఒకసారిగా గేట్లు తెరవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులను… గాయపడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తారన్నారు.

తెలంగాణ కోసం నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) గురువారం తన నివాసం నుండి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. కేటీఆర్ వెంట ఆయన తరఫు న్యాయవాది రామచంద్రరావు, సీనియర్ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కేటీఆర్ తన నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, తనపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలపై ఘాటైన ప్రకటన చేశారు.

విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కుమారుడిగా, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న పోరాట యోధుడిగా, కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) సైనికుడిగా తెలంగాణ ప్రతిష్ఠను పెంచేందుకు, హైదరాబాద్‌ను నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించాను. ఫార్ములా E కార్ రేస్ వంటి ఈవెంట్‌లను నిర్వహించడం అనేది గ్లోబల్ మ్యాప్‌లో BRS గవర్నెన్స్ యొక్క పదేళ్లలో, మేము మా కంపెనీకి బహుళ-కోట్ల కాంట్రాక్టులను ఇవ్వలేదు బంధువులు లేదా ల్యాండ్ క్రూయిజర్ల వంటి లగ్జరీ వాహనాలను అవినీతి ద్వారా సంపాదించుకున్న నేను ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదు.

ఆ వ్యక్తి వల్లే ఘటన జరిగింది?” తొక్కిసలాట ఘటనపై ఈవో క్లారిటీ..

తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ రియాక్షన్‌..

తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. “నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు.. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించాం. టీటీడీని రాజకీయ క్రీడా మైదానం గా మార్చారు. మీరు చేస్తున్న తప్పులతో భక్తులకు కష్టాలు తలెత్తాయి. టీటీడీ ఛైర్మన్‌ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీకి చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి దీనికి పూర్తి బాధ్యత వహించాలి.” అని భూమన వెల్లడించారు.

ఆ అధికారి అత్యుత్సాహం వల్లే జరిగింది?” తొక్కిసలాట ఘటనపై సీఎంకి నివేదిక

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు… అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని కలెక్టర్ రిపోర్టులో పేర్కొన్నారు. ” సమాచారం అందుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చారు. భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్‌ వాహనాన్ని టికెట్‌ కౌంటర్‌ బయట పార్క్‌ చేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్‌ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు’’ అని నివేదికలో వెల్లడించారు.

బాధిత కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. అంబులెన్సులలో మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఓ అధికారిని కూడా పంపుతున్నారు. కాగా.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మంత్రులు అనిత.. ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ రుయా ఆసుపత్రిలోని మార్చరీ వద్దకు చేరుకున్నారు. రుయా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. కలెక్టర్, ఎస్పీ ఘటన అంశాన్ని మంత్రులకు వివరించారు. మరోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది.

సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?

మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు మోహన్ బాబు. తాజాగా ఈ కేసు పై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు ఇవే..

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం నందినగర్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్, ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే అధికారులు అతనిపై విచారణ ప్రారంభించారు.

ఈ విచారణలో ముగ్గురు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను చర్చకు తెచ్చిన ఏసీబీ, కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్‌ ముందుంచినట్లు సమాచారం.

ఫార్ములా ఈ కార్‌ రేసు ఎందుకు తీసుకురావాలనుకున్నారు..?
ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.?
HMDA నిధులు ఎలా బదిలీ చేశారు. ?
కేబినెట్‌ అనుమతి ఉందా.?
అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారు.?
ఎవరికి ప్రయోజనం జరిగింది.?
కేటీఆర్‌ ఆదేశంతోనే నగదు రిలీజ్‌ చేశామని అరవింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌. దీనిపై మీ సమాధానం ఏంటి.?
హెచ్‌ఎండీఏ నుంచి ఈ కార్‌ రేసింగ్‌కు రూ.55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ ఎలా జరిగింది.?
నగదు బదిలీ చేయాలని ఎవరిని ఆదేశించారు. పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేశారా.?
దీనికి ఆదాయపన్ను మినహాయింపు ఉందా.?
ఐటీకి HMDA రూ.8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది.?
కార్‌ రేస్‌ కోసం మీరు ఎవరెవరిని కాంటాక్ట్‌ చేశారు.?
రాష్ట్రం నుంచి మీతో కాంటాక్ట్‌లో ఉన్న అధికారులు ఎవరు.?
కేంద్రం నుంచి సహకారం అందించిన వాళ్లు ఎవరు.?
ఫార్ములా ఈ కార్‌ రేస్‌ అధికారులను మీరు ఎప్పుడు కలిశారు.?

 

Show comments