చంద్రబాబును చూస్తుంటే జాలి వేస్తుంది..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పోలింగ్‌కు ముగిసింది. ఇక, జూన్ 4వ తేదీన తుది ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సర్వేలన్నీ మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధించబోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ‘చంద్రబాబు.. పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు.. 2019 ఎన్నికలలో మీకు వచ్చింది 23 స్థానాలే.. ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు.. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది.. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికే నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?.. ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించారు.
బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి..!
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించిన పలు ఆరోపణలు చేశారు.. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు.. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను.. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశా.. నా పాస్ పోర్ట్ కార్లో దొరికిందని చెప్పారు.. నా పాస్ పోర్ట్ నా దగ్గర ఉంది అని ఆయన పేర్కొన్నారు. కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉంది.. సోమిరెడ్డి దగ్గర ఉందా.. కర్ణాటక పోలీసుల వద్ద ఉందా అని ప్రశ్నించారు. దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అడిగారు. ఆ కారుతో నాకున్న సంబంధాలను రుజువు చేయమని కోరాను అని కాకాణి తెలిపారు. కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉంది.. కారుకు స్టికర్ ఉందని చెప్పి నా కారు అని చెప్పారు.. స్టికర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశా.. వారు విచారణ చేస్తున్నారు.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలియదు.. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలి.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి పార్టీకి సంబంధం లేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారు అనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కానీ సోమిరెడ్డి మాత్రం ఈ పార్టీని నాకు అంట కడుతున్నారు.. క్లబ్ కు వెళ్లడం, పేకాట ఆడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందాం అని సవాల్ చేశారు. బ్లడ్ శ్యాంపిల్స్ ఇచ్చేందుకు నేను సిద్ధం.. నెల్లూరులో ఉంటా, దమ్ముంటే సోమిరెడ్డి రావాలి అని కాకాణి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న అరెస్టులు..
పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిన్న దాచేపల్లి, తంగెడలాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న 33 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. టీడీపీకి చెందిన 11 మంది నిందితులను గుంటూరు జైలుకు తరలించగా.. వైసీపీకి చెందిన 22 మందిని నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ఇక, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను టీడీపీ- వైసీపీ నేతలు ధ్వసం చేశారు.. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, పల్నాడులో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు.
కోమటి రెడ్డి వెంకట రెడ్డి పై హరీష్ రావు ట్విట్.. అందులో ఏముందంటే..
మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పై ఎమ్మెల్యే హరీష్ రావ్ ట్విట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు విషం చిమ్మడం బాధాకరమన్నారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసిందన్నారు. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేని పోని ఆరోపణలు చేస్తున్నది. ఆస్పత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తుందన్నారు. టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బి శాఖ మంత్రి గారు మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని తెలిపారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్న మంత్రి గారికి, ఏప్రిల్ 5, 2022 న జైపూర్ లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు.? అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిఎం అరవింద్ కేజ్రీవాల్ గారు డిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు.? అని మండిపడ్డారు. నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలి. అంతేగానీ చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని సూచిస్తున్నా అన్నారు.
75 శాతం బీసీలను మమతా బెనర్జీ వెన్నుపోటు పొడిచారు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75 శాతం బీసీలను మమత వెన్ను పోటు పొడిచారని, కాంగ్రెస్‌లో ఉన్న హిందువులంధరు ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ గాంధీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, మహమ్మద్ గజిని చెయ్యలేని దారుణమైన దండయాత్రలు దేశ రిజర్వేషన్లపై చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం వర్గాలను ఓబీసీ కోటలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ… ‘రాజ్యాంగం ప్రకారం మతాలకతీతంగా అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోంది. మహమ్మద్ గజిని చెయ్యలేని దారుణమైన దండయాత్రలు దేశ రిజర్వేషన్లపై వీరు చేస్తున్నారు. ముస్లిం వర్గాలను ఓబీసీ కోటలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం. బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఓబీసీలో చేర్చడం దుర్మార్గమైన చర్య. హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగానే ముస్లిం రిజర్వేషన్లు మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నారు. ఓబీసీ కోటలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన బెంగాల్ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ టీమ్‌కు చెంపపెట్టు లాంటిది’ అని అన్నారు.
కిడ్నీ రాకెట్ కొత్త కోణం.. హైదరాబాద్, కేరళ వేదికగా దందా..
ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు. తాజాగా కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీస్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు సంచలన విషమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ డాక్టర్ కి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఠా సభ్యులు బెంగళూరు, హైదరాబాద్‌లోని పేద యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి అక్కడ వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరాన్ నుంచి కొచ్చికి వచ్చిన ముఠాలోని కీలక సభ్యుడు సబిత్‌ను కేరళ పోలీసులు గత ఆదివారం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సోమవారం అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
కేదార్ నాథ్ ధామ్ వద్ద హెలికాప్టర్ కు తప్పిన పెను ప్రమాదం
ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ ధామ్ వద్ద ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొంతమంది భక్తులు కూర్చున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్‌లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ చుక్కాని దెబ్బతింది. దీంతో హెలికాప్టర్‌ను ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారు. అయితే, సమీపంలో హెలిప్యాడ్ ఉంది. అప్పుడు పైలట్ తెలివిగా ఖాళీ స్థలం కోసం వెతికాడు. అనంతరం హెలికాప్టర్‌ను అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే గుంట ఉంది. ఈ సమయంలో, హెలికాప్టర్‌లో కూర్చున్న భక్తులు కాపాడాలంటూ దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెలికాప్టర్‌లోని సాంకేతిక లోపాలను ఫ్లైట్‌కు ముందే చెక్ చేసి ఉండాల్సిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ సేవ ఎప్పుడూ ప్రమాదకరమే. కేదార్‌నాథ్‌లో గత 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయి. మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే, చార్ ధామ్ యాత్ర కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై మే 31 వరకు నిషేధం ఉంది. దీని కారణంగా రిషికేశ్-హరిద్వార్‌లో తమ రిజిస్ట్రేషన్ కోసం వారాల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఉన్నారు. కానీ వారి రిజిస్ట్రేషన్ జరగడం లేదు. కేదార్‌నాథ్ బాబా దర్శనం లభిస్తుందని వారం రోజులుగా ఆశలు పెట్టుకున్నామని, అయితే ఆ ఆశ నీరుగారిపోతోందని భక్తులు అంటున్నారు. ప్రస్తుతం రోజుకు 25 వేల మందికి పైగా భక్తులు డ్యామ్‌కు చేరుకుంటున్నారు. భక్తులను ధామ్ వద్దకు తీసుకెళ్లేందుకు 9 హెలికాప్టర్ కంపెనీలు నిరంతరం మోహరించాయి. హెలికాప్టర్‌లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. కేదార్‌నాథ్ ధామ్‌కు 100 మీటర్ల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
మెగాస్టార్ మూవీ లో మరో యంగ్ హీరోయిన్..
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “విశ్వంభర”..ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా షూటింగ్ జులై నెల చివరికల్లా పూర్తి చేసి ఈ సినిమా సీజీ, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం మరింత సమయం తీసుకోని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులకు అందించనున్నారు.ఈ సినిమాను మేకర్స్ 2025 జనవరి 10న, సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని సమాచారం.ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ఠ సరికొత్త లోకం సృష్టింనట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ నటించబోతుంది.క్యూట్ బ్యూటీ అషికా రంగనాథ్ కు వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.ఈ పోస్ట్ సోషల్ మిడిల్ బాగా వైరల్ అవుతుంది.
టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు. హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతానికి కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా కోచ్ పదవిపై విదేశీ మాజీలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. అందుకు కారణాలు లేకపోలేదు. టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉంటే.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమని రికీ పాంటింగ్ చెప్పాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అదే కారణం చెప్పాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పిన కారణం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తనకు చెప్పాడని ఓ బాంబు పేల్చాడు. భారత జట్టులో ఐపీఎల్ కంటే వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్ ఉంటాయని రాహుల్ తనకు చెప్పాడని లాంగర్ పేర్కొన్నాడు. బీబీసీ స్టంప్డ్ పాడ్‌కాస్ట్‌లో ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ… ‘భారత జట్టు కోచ్ పదవి అద్భుతమైనది. కానీ నేను పోటీలో ఉండట్లేదు. టీమిండియా కోచ్ పదవి అందరినీ ఆకట్టుకునే పాత్ర అని నాకు తెలుసు. ఆస్ట్రేలియా జట్టుతో నాలుగేళ్లు పని చేశా. నిజాయితీగా చెప్పాలంటే నేను చాలా అలసిపోయా. భారత జట్టులో అధిక ఒత్తిడి ఉంటుంది. నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడాను. ‘ఐపీఎల్‌లో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయని మీకు తెలుసు. దానికి వెయ్యి రెట్లు అక్కడ ఉంటుంది’ అని రాహుల్ చెప్పాడు. ఇదో మంచి సలహా. టీమిండియా కోచ్ మంచి జాబే, కానీ నాకు కాదు’ అన్నాడు. రాహుల్ చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.