*ఈ నెల 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్.. విజయ సాయి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ ,జనసేన, టీడీపీ, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీకి నష్టం లేదన్నారు. అసలు టీడీపీకి ఒక రాజకీయ సిద్ధాంతం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో ఒక వైసీపీతో తప్ప చంద్రబాబు ప్రతి పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నాడని అన్నారు. అధికార దాహం తప్ప రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయని.. టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం కట్టకట్టుకుని వచ్చినా 46 శాతానికి మించలేదు, మించవన్నారు. మళ్లీ మరోసారి ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కడతారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
*జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఏమైనా పదవి ఇస్తే తీసుకుంటా..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని వెల్లడించారు. ఉదయం కిర్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 మధ్య పార్టీలో చేరిక ఉంటుందన్నారు. జగన్‌కి మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. సంక్షేమ పథకాలు పేదవారికి అందడానికి తన వంతుగా పార్టీలో చేరుతున్నానన్నారు. ఎటువంటి కండిషన్ లేకుండా పార్టీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు, తన కుమారుడికి ఎటువంటి సీటు అడగలేదన్నారు. దేవుడి దయ వల్ల జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏమైనా పదవి ఇస్తే తీసుకుంటానని ఆయన చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానన్న ముద్రగడ పద్మనాభం.. వైసీపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. తనకు, తన కుటుంబానికి ఎటువంటి పదవి కాంక్ష లేదన్నారు.
*‘‘ భర్తలు మోడీ జపం చేస్తే రాత్రి భోజనం పెట్టొద్దు’’.. మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు..
ప్రధాని నరేంద్రమోడీ పేరును జపించే భర్తలకు రాత్రి భోజనం పెట్టొద్దని మహిళలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. కుటుంబ సభ్యులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రూ.1000 పథకం నిజమైన సాధికరత అని కేజ్రీవాల్ మహిళలతో అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పేరు జపిస్తే రాత్రి భోజనం వడ్డించొద్దని ముఖ్యమంత్రి శనివారం సూచించారు. ‘‘చాలా మంది పురుషులు ప్రధాని నరేంద్రమోడీ పేరు జపిస్తున్నారు. కానీ మీరు దాన్ని సరిచేయాలి. మీ భర్తలు మోడీ పేరు జపిస్తే, అతనికి రాత్రి భోజనం పెట్టమని చెప్పండి’’ అని ఢిల్లీలో జరిగిన ‘మహిళా సమ్మాన్ సమరోహ్’ అనే కార్యక్రమంలో చెప్పారు. ప్రభుత్వం తన 2024-25 బడ్జెట్‌లో ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలవారీ మొత్తాన్ని రూ. 1,000 అందించే పథకాన్ని ప్రకటించిన తర్వాత మహిళలతో సంభాషించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఆప్‌కి మద్దతు ఇస్తామని మహిళలు ప్రమాణం చేయాలని కేజ్రీవాల్ కోరారు. మీ సోదరుడు మీకు అండగా ఉంటారని, బీజేపీకి మద్దతు ఇచ్చే ఇతర మహిళలకు కూడా ఈ విషయం చెప్పాలని కోరారు. ‘‘నేను మీకు ఉచిత కరెంట్, ఉచిత బస్ సౌకర్యం కల్పించానని, ఇప్పుడు ప్రతీ నెల మహిళలకు రూ. 1000 ఇస్తున్నానని చెప్పండి, బీజేపీ వారి కోసం ఏం చేసింది..? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి..? ఈ సారి కేజ్రీవాల్‌కి ఓటేయండి’’ అని కేజ్రీవాల్ అన్నారు. మహిళా సాధికారత పేరుతో ఇప్పటి వరకు మోసం జరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. పార్టీలు మహిళకు ఏదో ఒక పదవి ఇచ్చి మహిళలకు సాధికారత ఇచ్చామని చెబుతున్నాయి, మహిళలకు పదవులు వద్దని తాను చెప్పడం లేదని, దీని వల్ల ఇద్దరు ముగ్గురు మహిళలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు, మిగిలిన స్త్రీలకు ఏం లభిస్తుంది..? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ నిజమైన సాధికారత తీసుకువస్తుందని చెప్పారు. డబ్బు ఉన్నప్పుడే సాధికారత ఏర్పడుతుందని, మహిళలకు ప్రతీ నెల రూ. 1000 అందితే నిజమైన సాధికారత ఏర్పడుతుందని అన్నారు.
*ఢిల్లీలో 40అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ
ఢిల్లీలోని కేషోపూర్ మండి సమీపంలో ఓ చిన్నారి 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. చిన్నారి బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు చిన్నారిని రక్షించే చర్యలు చేపట్టారు. బోర్‌వెల్‌కు సమాంతరంగా మరో బోరుబావి తవ్వేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం తెలిపింది. బోర్‌వెల్ లోతు 40 అడుగులుండగా దానిలోపల చిన్నారిని బయటకు తీయడం చాలా కష్టం. NDRF బృందం కొత్త బోర్‌వెల్‌ను తవ్వడానికి చాలా సమయం పట్టవచ్చు. బోరుబావి దగ్గర జేసీబీతో దాదాపు 50 అడుగుల మేర తవ్వకాలు చేయనున్నారు. ఆ తర్వాత పైపును కోసి చిన్నారిని బోరుబావి నుంచి బయటకు తీస్తారు. మరోవైపు బోరుబావి నుంచి చిన్నారిని రక్షించే వీడియో కూడా బయటకు వచ్చింది. బోర్‌వెల్‌లోని చిన్నారిని రక్షించేందుకు స్థానిక ప్రజలు NDRF బృందానికి ఎలా సహాయం చేస్తున్నారో ఇందులో చూడవచ్చు. చిన్నారిని బయటకు తీయడానికి తాడును కూడా ఉపయోగించినట్లు చెబుతున్నారు. దీని సాయంతో బిడ్డను బయటకు తీయవచ్చని ముందుగా అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. బోర్‌వెల్ లోపల చాలా చీకటిగా ఉంది. టార్చ్ ద్వారా చిన్నారిని చూసే ప్రయత్నం చేశారు. చిన్నారితో మాట్లాడేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల చిన్నారి భయాందోళనలకు గురికాకుండా చూడవచ్చు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృతి.. 78 మందికి తీవ్ర అస్వస్థత..
ఆఫ్రికాలోని జాంజిబార్‌లో విషాదం నెలకొంది. ఆ ప్రాంతంలో అత్యంత రుచికరమైనందిగా భావించే, ప్రజలు ఇష్టంగా తినే తాబేలు మాంసం 9 మంది ప్రాణాలు తీసింది. జాంజిబార్ ద్వీప సమూహంలోని పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తినడంతో ఈ మరణాలు సంభవించాయి. మరో 78 మంది ఆస్పత్రి పాలైనట్లు అధికారులు శనివారం తెలిపారు. సముద్రం తాబేలు మాంసం జాంబిజార్ ప్రజలకు ఇష్టమైన ఆహారం. అయితే దీంట్లో ఉండే చెలోనిటాక్సిజం అనే విషం కొన్ని సందర్భాల్లో మరణాలకు దారి తీస్తుంది. మంగళవారం తాబేలు మాంసం తినడంతో అక్కడి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నారని ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయి. తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజిబార్‌లోని అధికారులు హమ్జా హసన్ జుమా నేతృత్వంలోని విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు. ప్రజలు సముద్ర తాబేలు మాంసం తినొద్దని ప్రజలను కోరారు. నవంబర్ 2021లో కూడా జాంజిబార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. సముద్ర తాబేలు మాంసం తిని పెంబాలో 3 ఏళ్ల బాలుడితో సహా ఏడుగురు మరణించారు. ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.
*కారు – ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆ కుటుంబం బీహార్‌లోని సీతామర్హి నివాసి. అందరూ ఏదో పని నిమిత్తం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కి ఎర్టిగా కారులో వెళ్తున్నారు. అయితే దారిలో ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. గౌరా బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహేలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వారణాసిలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో అనిల్ శర్మ, గజధర్ శర్మ, జవహర్ శర్మ, సోనమ్, గౌతమ్, రింకీ ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వారిలో మీనా శర్మ, యుగ్ శర్మ మరియు గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఘటనా స్థలం నుంచి ట్రక్కు, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ప్రమాదం చాలా ఘోరంగా ఉంది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. రక్తం కాలువలా ప్రవహించింది. పోలీసులు చాలా శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కారు ముక్కలైపోయింది. రాత్రి కూడా ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఐదు రోజుల క్రితం షాజహాన్‌పూర్ జిల్లాలో పెళ్లికి వచ్చిన అతిథులతో కూడిన కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. కాగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం ప్రకారం, ఠాణా కలాన్ ప్రాంతంలోని అబ్దుల్లా నగర్ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు స్థానికం నుండి పెళ్లి ఊరేగింపులో మద్నాపూర్ వెళ్లారు. ఈ వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున 2:15 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా నర్సుయ్య గ్రామ సమీపంలో వారి కారు వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
*ఆరోగ్యం బాగు కావాలని వెళ్తే.. మహిళపై భూతవైద్యుడి అత్యాచారం..
ముంబైకి చెందిన ఓ మహిళ ఆరోగ్యం కోసం భూతవైద్యుడిని సంప్రదిస్తే, అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్‌లో జరిగింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మహ్మద్ అష్రఫ్(50)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బాధిత మహిళకు భూతవైద్యం చేస్తున్నాననే నెపంతో గెస్ట్‌హౌజ్‌లో బంధించాడు. బాధిత మహిళ చాలా సేపటి నుంచి లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు గెస్ట్ హౌజ్ లోని గదిలోకి బలవంతంగా ప్రవేశించి చూడగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదుతో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కుటుంబం బాస్ఖారీ పరిధిలోని కిచ్చౌచాలోని గెస్ట్ హౌజుకు వచ్చినట్లు స్టేషన్ ఆఫీసర్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడి నుంచి ఆధ్యాత్మిక సాయం కోరుతూ ఒక వ్యక్తి, అతని తల్లి, భార్యలు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గెస్ట్ హౌజ్ చేసుకున్న తర్వాత సయ్యద్ మహ్మద్ అష్రఫ్ అనే నిందితుడు ఉద్దేశపూర్వకంగా వ్యక్తి భార్య కోసం ‘దువా-తవీజ్’ చేస్తానని ప్రతిపాదించాడు. ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాడు. ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు వారిని గెస్ట్ హౌజ్‌కి తీసుకెళ్లినట్లు బాధిత మహిళ భర్త ఫిర్యాదులో నమోదు చేశారు. కుటుంబం సమక్షంలో ప్రార్థనలు నిర్వహించడానికి బదులుగా, నిందితుడు అష్రఫ్ వారిని బయట ఉండమని, మహిళను గదిలోకి తీసుకెళ్లాడు. చాలా గంటల తర్వాత కూడా మహిళ బయటకు రాలేకపోవడంతో తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. బలవంతంగా తలుపు తెరచి చూస్తే మహిళ బలవంతానికి గురైన స్థితిలో కనిపించింది.
*భద్రతా మండలి సంస్కరణపై భారత్ హెచ్చరిక..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ) సంస్కరణపై మరోసారి భారత్ గళం విప్పింది. భద్రతా మండలి సంస్కరణలు చేపట్టాలని కోరింది. ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిక కాంబోజ్ శనివారం న్యూయార్క్‌లో జరిగిన 78వ సెషన్ అనధికార సమావేశంలో యూఎన్ఎస్‌సీ సంస్కరణ ఆవశ్యతను ఎత్తి చూపారు. అర్ధశతాబ్ధంకి పైగా వీటిపై చర్యలు కొనసాగుతున్నాయని, ప్రపంచం మరియు భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని అన్నారు. ‘‘2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం సమ్మిట్‌లో ప్రపంచ నాయకులు భద్రతా మండలి అన్ని అంశాలపై సమగ్ర సంస్కరణను సాధించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించాయి, దాదాపుగా పావు శతాబ్ధం గడిచింది. ప్రపంచం మరియు మన భవిష్యత్ తరాలు ఇక వేచి ఉండలేవు. వారు ఇంకెంత కాలం వేచి ఉండాలి..?’’ అని కాంబోజ్ ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సం సెప్టెంబర్‌లో జరగనున్న కీలకమైన శిఖరాగ్ర సమావేశం వంటి కీలక సందర్భాలను ప్రస్తావిస్తూ.. సంస్కరణలను చేపట్టాలని సూచించారు. యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పు అసమానతలను పెంచే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. భారతదేశం సహా G-4 సభ్యదేశాలైన బ్రెజిల్, జపాన్, జర్మనీ, 193 సభ్యదేశాల అభిప్రాయాల వైవిధ్యం ప్రతిబింబించే ప్రాముఖ్యతను రచికా కాంబోజ్ నొక్కి చెప్పారు. కౌన్సిల్‌లో శాశ్వత సభ్యదేశంగా ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ భారత్‌కి మద్దతు తెలిపింది. శాశ్వత సభ్య దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, రష్యాలు భారత్‌కి మద్దతు తెలుపుతుండగా.. చైనా మాత్రం ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తోంది.
*26 ఏళ్ల వయసులో అడల్ట్ ఫిల్మ్‌స్టార్ సోఫియో లియోన్ మృతి..
అడల్ట్ ఫిల్మ్‌స్టార్స్ వరసగా మరణిస్తున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల సోఫియా లియోన్ ఈ నెల ప్రారంభంలో తన అపార్ట్‌మెంట్‌లో మరణించింది. ఈ విషయాన్ని ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో శనివారం తెలిపారు. మార్చి 1న యూఎస్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో సోఫియా అచేతన స్థితిలో ఉండగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ‘‘ ఆమె తల్లి, కుటుంబం తరుపున, మా ప్రియమైన సోఫియా మరణించిన వార్తను నేను భారమైన హృదయంతో పంచుకుంటున్నాను’’ని రోమెరో చెప్పారు. సోఫియా మరణం ఆకస్మిక మరణం ఆమె కుటుంబం, స్నేహితులకు విధ్వంసం, దిగ్భ్రాంతికి గురిచేసింది. సోఫియా కోసం న్యాయం కోరే కష్టమైన ప్రక్రయ పైనే కుటుంబం సిద్ధంగా లేని ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది అని రోమిరో జోడించారు. మరణానికి గల కారణాలను స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మోడలింగ్ ఏజెన్సీ-101 మోడలింగ్ కూడా ఈ వార్తని ధృవీకరించింది. మా ప్రియమైన సోఫియా లియోన్ అకాల, విషాదకరమైన మరణంతో మా హృదయాలు ముక్కలయ్యాయి అని చెప్పింది. రిప్ స్వీట్ ఎంజెల్ అని ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఆమె ఆత్మహత్యతో చనిపోలేదని, ఎవరైనా హత్య చేసుంటారా..? అనే కోణంలో దర్యాప్తు చేయబడుతోంది. సోఫియా లియోన్ 18 ఏళ్ల వయసులో అడల్ట్ పరిశ్రమలోకి వచ్చింది. సోఫియా లియోన్ జూన్ 10, 1997లో అమెరికాలోని మియామిలో జన్మించింది. అడల్ట్ పరిశ్రమలో వరసగా పలువురు స్టార్స్ మరణించడం ఇటీవల కాలంలో అందర్ని షాక్‌కి గురిచేస్తోంది. లియోన్‌కి ముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్ మరియు థైనా ఫీల్డ్స్ అనుమానాస్పద రీతిలో మరణించారు.