తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు(68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్ల నుంచి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మళయాళం, హిందీ చిత్రాలకు కూడా ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. తమిళ చిత్రం ‘అవళ్ ఓరు పచ్చికొళందై’తో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన వివిధ భాషల్లో ఇప్పటివరకు దాదాపు 800 వందల చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. ఆయన 1954 జనవరి 15న ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం చెన్నైకి షిప్ట్ అయింది. ఆయనకు సంధ్య, సుమాంజలి ఇద్దరు పిల్లలన్నారు.
సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అరుణాచలం థియేటర్‌లో ఆపరేటివ్ కెమెరామన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఎడిటర్ కమ్ డైరెక్టర్ సంజీవి దగ్గర కూర్పరిగా మెళకువలు నేర్చుకున్నారు. తమిళ చిత్రం ‘అవళ్ ఓరు పచ్చికొళందై’తో ఎడిటర్‌గా ప్రమోషన్ పొందారు. తమిళ రీమేక్ ‘చట్టానికి కళ్లు లేవు’ ఆయన తెలుగులో చేసినన తొలి చిత్రం. ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం చూసిన జంధ్యాల తన మొదటి చిత్రమైన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రానికి ఎడిటర్‌గా తీసుకున్నారు. ‘నాలుగు స్తంభాలాట’ నుండి జంధ్యాల అన్ని చిత్రాలకూ ఆయనే ఎడిటర్‌గా పనిచేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఎడిటర్‌గా కొనసాగిన ఆయన.. సినీ జీవితంలో ఆరు నందులను గెలుచుకున్నారు. శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, చందమామ రావె, హై హై నాయకా, భారత నారి, ఆది చిత్రాలకు నంది అవార్డులను గెలుచుకున్నారు.
ఖైదీ నెంబర్ 150, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, ఆపరేషన్ దుర్యోధన గబ్బర్ సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్, మిరపకాయ్, కృష్ట, డాన్ శీను, సౌఖ్యం, డిక్టేటర్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సమాచారం.