Today Stock Market Roundup 05-04-23: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఇవాళ బుధవారం లాభాలతో ప్రారంభమై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై కనిపించకపోవటం గమనించాల్సిన అంశం. దీంతో.. ఇంట్రాడేలో కూడా లాభాలు కొనసాగాయి. గత ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో వ్యాపార రంగం ఆరోగ్యవంతమైన ఫలితాలను కనబరచటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును రేపు పెంచనుందనే వార్తల నేపథ్యంలో ఆర్థిక రంగ సంస్థల షేర్ల వ్యాల్యూ పెరిగింది. సెన్సెక్స్ 582 పాయింట్లు పెరిగి 59 వేల 689 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 17 వేల 557 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు లాభాల బాట పట్టాయి. మిగతా 10 కంపెనీలు నష్టాలు చవిచూశాయి.
read more: Alibaba Group Splitting: అలీబాబా.. అర డజను ముక్కలు. వ్యూహం మార్చిన జాక్ మా వ్యాపార సామ్రాజ్యం
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ బాగా రాణించింది. ఈ రంగం ఒక శాతం లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో ఇండెక్స్‌లు డౌన్ అయ్యాయి.
వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 4 శాతం ర్యాలీ తీశాయి. మార్చి క్వార్టర్‌లో లోన్ బుకింగ్స్ గ్రోత్ అవటం కలిసొచ్చింది. మరో వైపు.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ విలువ ఒక శాతం పడిపోయింది.
10 గ్రాముల బంగారం ధర 202 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 60 వేల 822 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు స్వల్పంగా 70 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 688 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర అతిస్వల్పంగా 29 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 590 రూపాయలుగా నమోదైంది.
రూపాయి వ్యాల్యూ 31 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 2 పైసల వద్ద స్థిరపడింది.