Today Stock Market Roundup 28-02-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈమధ్య తీవ్రమైన నష్టాల్లో నడుస్తోంది. గడచిన వారం రోజుల్లో ఏకంగా 120 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ మంగళవారం ఉదయం రెండు కీలక సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కానీ.. ఇంట్రాడేలో డౌన్ అయ్యాయి.
చివరికి.. వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లో క్లోజయ్యాయి. ఆసియా ఖండంలోని ఇతర దేశాల మార్కెట్లు లాభాల్లో కొనసాగగా మన మార్కెట్లు నష్టాలను పొందటం గమనించాల్సిన విషయం. సెన్సెక్స్ 326 పాయింట్లు తగ్గి 58 వేల 962 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17 వేల 303 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
read more: Surf Excel: తొలి ఇండియన్ బ్రాండ్‌గా అరుదైన రికార్డు
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు నష్టాల్లో నడిచాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ తీసింది. ఐటీ, మెటల్ షేర్లు నేల చూపులు చూశాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. త్రివేణి టర్బైన్ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పెరిగింది.
సిప్లా స్టాక్స్ వ్యాల్యూ 4 శాతం పడిపోయి దాదాపు 52 వారాల కనిష్టానికి దిగజారింది. ఇటీవల నష్టాల బాటపట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్.. రివర్స్ ట్రెండ్‌లో ముందుకెళుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల విలువ 14 శాతానికి పైగా పెరగటం విశేషం. 10 గ్రాముల బంగారం ధర 226 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 55,250 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 346 రూపాయలు కోల్పోయింది. అత్యధికంగా 62,618 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 65 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6,338 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 14 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 67 పైసల వద్ద స్థిరపడింది.