Today Stock Market Roundup 18-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. ఇవాళ మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి. ఐటీ మరియు పవర్ కంపెనీల షేర్లు నేల చూపులు చూడటంతో సెన్సెక్స్, నిఫ్టీ ఒత్తిడికి గురయ్యాయి.
అయితే.. ఫార్మా మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం స్థిరంగా లాభాలను ఆర్జించటం కాస్త ఉపశమనం కలిగించింది.
సెన్సెక్స్ 252 పాయింట్లు కోల్పోయి 59 వేల 658 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 17 వేల 660 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
read more: Apple First Retail Store in India: ఏడేళ్ల యాపిల్ కల.. నెరవేరిన వేళ..
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో సగం కంపెనీలు లాభపడగా, సగం కంపెనీలు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ రియాల్టీ మరియు పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు సున్నా పాయింట్ 5 శాతం చొప్పున పెరిగాయి. మరో వైపు.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సున్నా పాయింట్ 4 శాతం పడిపోయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు సున్నా పాయింట్ 6 శాతం వరకు రాణించాయి.
వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. పవర్‌గ్రిడ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, టెక్ మహింద్రా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, విప్రో, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా నష్టపోయాయి.
ఇవాళ కొత్తగా అవలాన్ టెక్నాలజీస్ అనే సంస్థ ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయింది. ఇష్యూ ప్రైస్ 436 రూపాయలు కాగా ఒకటీ పాయింట్ ఒకటీ ఐదు శాతం డిస్కౌంట్‌తో 431 రూపాయల వద్ద నమోదైంది. 10 గ్రాముల బంగారం ధర 134 రూపాయలు పెరిగింది. దీంతో గరిష్టంగా 60 వేల 314 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు నామమాత్రంగా 23 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 835 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 607 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ నిన్నటి కన్నా ఇవాళ 7 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 4 పైసల వద్ద స్థిరపడింది.