Apple First Retail Store in India: లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ కొనుక్కోవాలనేంత రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కంపెనీ.. యాపిల్. ఇండియాలో రిటైల్ స్టోర్‌ను ఏర్పాటుచేయాలని ఏడేళ్లుగా ఈ సంస్థ కంటున్న కలలు నెరవేరాయి. మన దేశంలో యాపిల్ కంపెనీ మొట్టమొదటి రిటైల్ స్టోర్.. ఆర్థిక రాజధాని ముంబైలో ఇవాళ ప్రారంభమైంది.
ఆశగా ఎదురుచూసిన ఆ రోజు ఎప్పుడు అనేది రెండు రోజుల కిందట మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు.. ఈ నెల చివరి వారంలో ఉండొచ్చని అన్నారు.ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏడేళ్ల నుంచి అలుపెరగకుండా చేస్తున్న ప్రయత్నాలను ఒకసారి పరిశీలిద్దాం. ముంబైలోని అత్యంత కమర్షియల్ ఏరియా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది.
Read more: Telangana Exports: తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా..
ఇండియా అపర కుబేరుడైన ముఖేష్ అంబానీకి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న జియో వరల్డ్ డ్రైవ్ అనే మాల్‌లో ఈ యాపిల్ స్టోర్‌ని ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ నెల 5వ తేదీన అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. మన దేశంలో యాపిల్ కంపెనీ ఇప్పటివరకు గూడ్స్ మరియు సర్వీసులను మాత్రమే అందించింది. అది కూడా నేరుగా కాకుండా థర్డ్ పార్టీ రిటైలర్ల ద్వారా చేసింది.
ఈ మేరకు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ తదితర ఆన్‌లైన్ పోర్టల్స్ సాయం తీసుకుంది. యాపిల్ తొలిసారిగా ఇండియాలోకి 2008లో అడుగుపెట్టింది. అది జరిగిన ఎనిమిదేళ్ల అనంతరం 2016లో ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్
భారతదేశంలో ఫస్ట్ టైమ్ పర్యటించారు. తర్వాత.. రిటైల్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. కానీ.. యాపిల్ కంపెనీ ప్రయత్నాలు అనుకున్నంత తొందరగా ఫలించలేదు.
ఫారన్ రిటైలర్లు ఇండియాలో స్టాండలోన్ స్టోర్లను ఏర్పాటుచేయాలంటే.. రా మెటీరియల్స్‌లో 30 శాతాన్ని లోకల్‌గానే
సమకూర్చుకోవాలనే నిబంధన ఉండేది. ఈ కఠినమైన నిబంధన యాపిల్ సంస్థకు ప్రతిబంధకంగా మారింది. దీని నుంచి ఉపశమనం పొందటానికి మూడేళ్లు పట్టింది. కష్టపడి లాబీయింగ్ చేయగా.. ఆ నిబంధనను కేంద్ర ప్రభుత్వం 2019లో సడలించింది. దీంతో యాపిల్ కంపెనీ ఊపిరిపీల్చుకుంది.
2019లోనే.. అక్టోబర్‌లో.. ముంబైలో.. పాతిక వేల చదరపు అడుగుల స్థలాన్ని రిటైల్ స్టోర్ కోసం సేకరించగలిగింది. అయితే.. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలలు తిరిగే సరికి 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా ఎంటరైంది. ఫలితంగా.. ఆఫ్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటుచేయాలనుకున్న యాపిల్ సంస్థ ప్రయత్నాలు మళ్లీ పట్టాలు తప్పాయి. కానీ.. 2020లోనే.. సెప్టెంబర్ నెలలో.. ఆన్‌లైన్ స్టోర్‌ని లాంఛ్ చేయటం ద్వారా సంతృప్తి చెందింది.
ఆ తర్వాత మూడేళ్లకి.. అంటే.. ఇప్పుడు.. ఆఫ్‌లైన్ స్టోర్‌ని ఆరంభించింది. ఈమధ్య కాలంలో.. 2017 నుంచి యాపిల్ సంస్థ ఇండియాతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. సరఫరా వ్యవస్థలో పాలు పంచుకోవటంతోపాటు తక్కువ స్థాయి ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. దేశంలోని మొత్తం ఐఫోన్లలో కనీసం పాతిక శాతం ఫోన్లనైనా ఇండియాలో ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు పెడుతూ వస్తోంది.
ఇతరత్రా సర్వీసుల ద్వారా మన దేశంలో కస్టమర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలను విస్తరించింది. జనాభాలో భారతదేశం చైనాను ఓవర్‌టేక్ చేయనుండటం.. అమెరికా చైనా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో యాపిల్ కంపెనీ దక్షిణాసియా దేశమైన ఇండియాపై ఫోకస్ పెట్టింది. మన దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండటంతో వాళ్లను లక్ష్యంగా ఎంచుకుంది.
ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఇతర ప్రొడక్టులను వాళ్లకు అమ్మటం ద్వారా బిజినెస్ పెంచుకోవాలని నిర్ణయించుకుంది. కాగా.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతం ఇటీవలే వార్తల్లో నిలిచింది. అక్కడ.. నీతా అంబానీ కల్చరల్ ఆర్ట్స్ సెంటర్ లేటెస్ట్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే.