Today Business Headlines 28-03-23:
4 ఏళ్లలో 2134 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సీఎస్‌ఆర్.. కింద 2 వేల 134 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఈ నిధులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. 2016-17వ సంవత్సరం నుంచి 2020-21వ సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్ ఇంద్రజిత్‌సింగ్ ఈ సమాధానం చెప్పారు.
మహేశ్ బాబు, తమన్నా
హ్యావెల్స్ ఇండియా కంపెనీ తయారుచేసే లాయిడ్ గ్రాండే హెవీ డ్యూటీ ఏసీ మెషిన్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా హీరో మహేష్ బాబు, హీరోయిన్ తమన్నా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రచార చిత్రంలో వీళ్లిద్దరు నటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బ్రాండ్ ప్రొడక్టులు పాపులర్ అయ్యేందుకు, లాయిడ్ ఏసీల సేల్స్ పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎండాకాలం ప్రారంభం కావటంతో ఏసీ మెషిన్ల కొనుగోళ్లు జోరందుకోనున్నాయని, అందుకే తాము కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని హ్యావెల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ పేర్కొన్నారు.
‘ఆహా’.. ఏం ప్లాన్?
తెలుగులో బాగా క్లిక్ అయిన ఓవర్ ది టాప్.. ఓటీటీ.. ప్లాట్‌ఫామ్ ఆహా.. మరిన్ని భాషల్లోకి విస్తరించనుంది. ఎంటర్టైన్‌మెంట్‌కి సంబంధించి కొత్త సెగ్మెంట్లలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే మూడేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. దీనికోసం కొత్త సీఈఓగా రవికాంత్ సబ్నవిస్‌ని ఎంపిక చేశారు. ఈయనకు ఎంటర్టైన్‌మెంట్ అండ్ సర్వీస్ సెక్టార్‌లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని ఆహా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు సీఈఓగా వ్యవహరించిన అజిత్ ఠాకూర్‌ని బోర్డ్ డైరెక్టర్‌గా నియమించారు.
‘గ్రీన్’ కోసం 800 కోట్లు
మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి విడతలో 70 శాతం నిధులను.. అంటే.. 560 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రీన్ మొబిలిటీ కోసం దేశవ్యాప్తంగా 7 వేల 432 పబ్లిక్ ఫాస్ట్-ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసేందుకు ఈ నిధులను ఖర్చుపెట్టనున్నారు. 2024 మార్చి నెలాఖరు నాటికి స్టేషన్ల ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు ఈ ఫండ్స్‌తో రిటైల్ ఔట్‌లెట్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తేనున్నాయి.
డిఫాల్టర్ల వాదన వినాలి
రుణాలు తిరిగి చెల్లించనివాళ్ల అకౌంట్లను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించేముందు బ్యాంకులు తప్పనిసరిగా ఆయా డిఫాల్టర్ల వాదనలు వినాలని సుప్రీంకోర్టు సూచించింది. తన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కును అవతలి వ్యక్తికి కల్పించకుండా బ్యాంకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని హితవు పలికింది. ఇలా చేస్తే.. సిబిల్ స్కోర్ దెబ్బతింటుందని, భవిష్యత్తులో రుణాలు పొందలేరని పేర్కొంది. ఒక రకంగా ఇది వాళ్లను బ్లాక్ లిస్టులో ఉంచినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే రుణ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది.
ఏఐతో మోసాలకు చెక్
ఆర్థిక మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు టెలికం కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. మే నెల ఒకటో తేదీ లోపే ఈ ఏర్పాటుచేసుకోవాలని కోరింది. జనాన్ని బురిడీ కొట్టించే మెసేజ్‌లకి, ఫోన్ కాల్స్‌కి చెక్ పెట్టాలన్నా, వాటిని ఆటోమేటిగ్గా బ్లాక్ చేయాలన్నా టెక్నాలజీతోనే సాధ్యమని తెలిపింది. ఈ మేరకు టెలికం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశాన్ని 15 రోజులకొకసారి సమీక్షిస్తామని ట్రాయ్ చైర్మన్ పీవీ వాఘేలా పేర్కొన్నారు.