Today Business Headlines 21-04-23:
100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగు చొప్పున ఇవి రానున్నాయి. అంటే.. తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఏర్పాటుకానున్నాయి. ప్రజలకు మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో స్ట్రీట్ ఏర్పాటుకు కోటి రూపాయలను కేటాయించనుంది. పట్టణాభివృద్ధి శాఖతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇరవై ఏళ్లలో పది రెట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన పదేళ్లలో బంగారం ధర 10 రెట్లకు పైగా పెరిగింది. రేపు అక్షయ తృతీయ నేపథ్యంలో గత రెండు దశాబ్దాల్లో అక్షయ తృతీయ నాడు నమోదైన పసిడి ధరలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ 20 ఏళ్లలో నాలుగు సార్లు మాత్రమే గోల్డ్ రేటు పడిపోయింది. చివరి మూడేళ్లలో బంగారం ధర పెరుగుదల మరీ ఎక్కువగా ఉండటం విశేషం. అక్షయ తృతీయ సందర్భంగా జరిగే గోల్డ్ బిజినెస్‌లో దక్షిణాది రాష్ట్రాల్లోనే 40 శాతం నమోదవుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కార్బన్ న్యూట్రల్ లక్ష్యం
వచ్చే రెండేళ్లలో.. అంటే.. 2025 నాటికి.. 121 ఎయిర్‌పోర్ట్‌లను కార్బన్ న్యూట్రల్‌గా మారుస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఇప్పటికే 25 ఎయిర్‌పోర్టుల్లో వంద శాతం స్వచ్ఛ ఇంధనాన్ని వాడుతున్నామని తెలిపారు. విమానయాన రంగంలో కార్బన్ ఎమిషన్స్‌పై ఫోకస్ పెట్టామని, ఈ మేరకు పలు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కల్లా సెంట్‌పర్సెంట్ క్లీన్ ఫ్యూయెల్ వినియోగించేలా విమానాశ్రయాలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
పన్ను ఎగవేత రెట్టింపు
గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎగవేతల విలువ లక్ష కోట్ల రూపాయలకు పైమాటేనని అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది దాదాపు రెట్టింపు అని చెప్పారు. గతేడాది ఎగవేతల నుంచి 21 వేల కోట్ల రూపాయలను, అంతకుముందు సంవత్సరం కూడా ఇంతే మొత్తాన్ని రికవరీ చేశామని వెల్లడించారు. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు, మోసాలను గుర్తించేందుకు సమాచార విశ్లేషణ చేస్తున్నామని అన్నారు.
‘మలబార్’కి అలియా
ప్రముఖ జ్యూలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి అలియా భట్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం జరిగింది. ఫేమస్ హీరోయిన్‌గా అలియా భట్‌కి ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల తమ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరుగుతుందని మలబార్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కంపెనీ.. పది దేశాల్లో 312 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. ఈ విషయాలను మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ వెల్లడించారు.
పెరిగిన ప్యాసింజర్లు
హైదరాబాద్‌కి సమీపంలోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల మందికి పైగా ప్రయాణాలు చేశారు. అంతకుముందు ఏడాది కోటీ 24 లక్షల మంది జర్నీ చేశారు. దీంతో పోల్చితే కిందటేడాది రాకపోకలు సాగించినవారి సంఖ్య 69 శాతం వృద్ధి సాధించిందని చెప్పొచ్చు. ఈ విషయాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు పంపిన సమాచారంలో వెల్లడించింది.