Today Business Headlines 11-04-23:
ప్రైవేట్ వ్యవసాయం
ప్రైవేట్ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఐదు కంపెనీలకు పచ్చజెండా ఊపింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియలో దాదాపు 50 వేల హెక్టార్లలో కొన్ని ఉద్యానవన పంటలను సాగు చేస్తారు. ఏపీలో 103 కోట్ల రూపాయలతో దేశాయ్ ఫుడ్ అనే కంపెనీ అరటి క్లస్టర్‌ను ఏర్పాటుచేస్తుంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మ్యాంగో క్లస్టర్‌ను డెవలప్ చేస్తారు. ఈ లిస్టులో మహారాష్ట్ర, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ సైతం ఉన్నాయి.
‘డబ్బా’ కొడతారబ్బా
అనధికారికంగా ట్రేడింగ్ నిర్వహించే సంస్థల పట్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచించింది. ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వెలువల ట్రేడింగ్ నిర్వహించటాన్ని డబ్బా ట్రేడింగ్ అని అంటుంటారు. ఇలాంటి వ్యాపారం చేసే కొన్ని కంపెనీలను ఎన్ఎస్ఈ గుర్తించి, వాటి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ పార్వ్వనాథ్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ పార్శ్వనాథ్ బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెయిరీటేల్ ట్రేడింగ్, ట్రేడ్ విత్ ట్రస్ట్ వంటి సంస్థలకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మెంబర్‌షిప్ లేదని స్పష్టం చేసింది.
సాగరమాల విధానం
కేంద్ర ప్రభుత్వం సాగరమాల ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీని తీసుకొచ్చింది. సముద్ర రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక విధానానికి రూపకల్పన చేసింది. ఈ మేరకు ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక డ్రాఫ్టును విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారికి మేధో హక్కులు మరియు పేటెంట్ల విషయంలో సాయం చేస్తారు. ఈ విధానం వల్ల ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకులకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.
మోడీకి ఫాలోవర్‌గా
ట్విట్టర్ అండ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. తన సామాజిక మాధ్యమంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని అనుసరిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ హ్యాండిల్ నిన్న సోమవారం తెలిపింది. ట్విట్టర్‌లో ఎక్కువ మంది అనుసరిస్తున్న గ్లోబల్ లీడర్లలో మోడీ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్.. మోడీని ఫాలో అవుతుండటంతో ఆయన కంపెనీ టెస్లా త్వరలో ఇండియాలో ఫ్యాక్టరీని ఏర్పాటుచేయనుందనే ప్రచారం మొదలైంది. ఎలాన్ మస్క్ 193 మందిని ఫాలో అవుతుండగా ఆయన్ని ఏకంగా 134 మిలియన్ల మందికి పైగా అనుసరిస్తుండటం విశేషం.
గోల్డ్ లోన్లకు గిరాకీ
బంగారానికి రేటు పెరగటంతో గోల్డ్ లోన్లకు కూడా గిరాకీ పెరిగింది. లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుండటమే దీనికి కారణం. పసిడి ధర తాజాగా 61 వేల రూపాయలు దాటింది. ఫలితంగా చాలా మంది ఇప్పుడు బంగారం రుణాల కోసం క్యూ కడుతున్నారు. అయితే.. పుత్తడి రేటు ఎక్కువ కాలం ఇలాగే కొనసాగుతుందా అనే డౌట్లు బ్యాంకులను మరియు ఎన్‌బీఎఫ్‌సీలను వెంటాడుతున్నాయి. అందువల్ల వల్ల ముందుజాగ్రత్త పాటిస్తున్నాయి. బంగారం విలువలో గరిష్టంగా 60 శాతానికి సమానమైన రుణాన్ని మాత్రమే మంజూరు చేస్తున్నాయి.
1 కోసం 49 ఆసక్తి
ఫ్యూచర్ రిటైల్ కంపెనీ బిజినెస్‌లను మరియు ఆస్తులను వేర్వేరుగా లేదా గుంపగుత్తగా సొంతం చేసుకునేందుకు ఏకంగా 49 సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌లను దాఖలు చేశాయి. దీంతో.. ఫ్యూచర్ రిటైల్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ త్వరలోనే తేలిపోతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా ఫ్యూచర్ రిటైల్ బిజినెస్ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో తన పరిధిలోని 19 రిటైల్ వ్యాపారాలను 24 వేల 713 కోట్ల రూపాయలకు అమ్మటానికి 2020 ఆగస్టులో రిలయెన్స్ రిటైల్‌తో ఒప్పందం చేసుకుంది.