Today (21-02-23) Business Headlines:
హైదరాబాద్ సంస్థకి సెబీ ఫైన్
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ ఎస్ఎస్ ఆర్గానిక్స్‌కి సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. ఫైన్ వేసింది. ఈ కంపెనీపై 5 లక్షల రూపాయలు జరిమానా విధించింది. దీంతోపాటు మరో ఆరుగురికి 6 లక్షల రూపాయల ఫైన్ వేసింది. ఏఆర్ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థతో జరిపిన రిలేటెడ్ పార్టీ లావాదేవీలను వెల్లడించటాన్ని తప్పుపట్టింది. ట్రాన్సాక్షన్లను ఆమోదించే విషయంలో ఎస్ఎస్ ఆర్గానిక్స్ అనుసరించిన ప్రక్రియను సైతం పరిశీలించి ఈ ఆదేశాలను జారీ చేసింది. ఎస్ఎస్ ఆర్గానిక్స్ కంపెనీని ప్రస్తుతం ఆక్సిజెంట ఫార్మాస్యుటికల్గా వ్యవహరిస్తున్నారు.
90 బిలియన్ డాలర్లకు పతనం
గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఘోరాతిఘోరంగా పడిపోయింది. 290 బిలియన్ డాలర్ల గరిష్ట విలువ నుంచి ప్రస్తుతం 90 బిలియన్ డాలర్లకు పతనమైంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ కావటంతోపాటు మార్కెట్ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవటంతో అతికొద్దికాలంలోనే 200 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. అదానీ గ్రూపులో మొత్తం 10 కంపెనీలు ఉండగా అందులో 9 కంపెనీలు నిన్న సోమవారం నష్టాల బాటలో నడిచాయి. అదానీ గ్రూప్ కంపెనీల విలువతోపాటు వ్యక్తిగతంగా అదానీ సంపద కూడా క్షీణిస్తూ వస్తోంది. 119 బిలియన్ డాలర్ల నుంచి 49 బిలియన్ డాలర్లకు డౌన్ అయింది.
చక్కెర పరిశ్రమపై పుస్తకం
చక్కెర పరిశ్రమపై రూపొందించిన పరిశోధన పుస్తకాన్ని నిన్న సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ రూపొందించారు. బుక్ పేరు.. మై ప్రజెంటేషన్స్ ఎట్ షుగర్ ఇండస్ట్రీస్ వర్క్‌షాప్స్ అండ్ కాంగ్రెసెస్. పుస్తక రచయిత ముళ్లపూడి నరేంద్ర నాథ్ దాదాపు 45 ఏళ్లుగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగిన వర్క్‌షాపులు మరియు కాంగ్రెస్‌లలో 29 పరిశోధన పత్రాలను సమర్పించారు. వాటన్నింటినీ కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు. 31వ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ షుగర్‌కేన్ టెక్నాలజిస్ట్ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు.
శాలరీ ప్యాకేజీ సగానికి కట్
ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవటంలో భాగంగా ఇప్పటివరకు లేఆఫ్‌లు, సంస్థల మూసివేతలు, సీఈఓల శాలరీ కటింగ్‌లకు పాల్పడిన టెక్నాలజీ సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల వేతనాల్లోనూ కోతపెట్టడం ప్రారంభించాయి. ఈ మేరకు విప్రో కంపెనీ తెర లేపింది. శాలరీ ప్యాకేజీని సగానికి సగం తగ్గిస్తున్నట్లు ఫ్రెషర్స్‌కి ఇ-మెయిల్స్ పంపుతోంది. 2022-23 వెలాసిటీ గ్రాడ్యుయేట్స్ కేటగిరీలో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న ఫ్రెషర్స్‌కి గతంలో ఆరున్నర లక్షల రూపాయాల వేతన ప్యాకేజీ ఇస్తామని ఆఫర్ చేయగా ఇప్పుడు 50 శాతం కట్ చేసింది. ట్రైనింగ్‌లో పెర్ఫార్మెన్స్ బాగాలేదంటూ 425ని తీసేయటం తెలిసిందే.
ఐటీ పోర్టల్‌లో క్యాలికులేటర్
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో క్యాలికులేటర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎవరు ఎంత పన్ను కట్టాలనేది ఈజీగా లెక్కించుకోవచ్చు. కొత్త ఆదాయపు పన్ను విధానం బెటరా లేక పాతది ఉత్తమమా అనే అంశాన్ని ఈ క్యాలికులేటర్ సాయంతో నిర్ణయించుకోవచ్చు. సెక్షన్ 115 BAC కింద వ్యక్తులు, HUF, AOP, BOI, AJPలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఐటీ విభాగం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే.
10 బిలియన్ డాలర్ల ఖర్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం దాదాపు 10 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఈ మేరకు జరిగిన ఖర్చులో ఇప్పటివరకు 7 బిలియన్ డాలర్లే అత్యధికం కావటం గమనించాల్సిన అంశం. అది కూడా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద జరిగింది. ఈ వ్యయాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి. కానీ.. ఇప్పుడు కేవలం 9 నెలల్లోనే 10 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టడం చెప్పుకోదగ్గ విషయం. ఇదే ప్రస్తుతానికి అత్యధికం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ డేటాను ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది.