Today (18-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు కూడా జోష్ కనిపించింది. ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం వరకు భారీగా లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 61 వేల పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 18 వేల పాయింట్లకు పైనే ట్రేడ్ అయింది.
ఎంపిక చేసిన ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బెంచ్‌మార్క్ సూచీలకు లాభాలు కొంత వరకు తగ్గినా గానీ అంతర్జాతీయ సానుకూల సంకేతాలు అండగా నిలిచాయి. 390 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 61 వేల 45 పాయింట్ల వద్ద ముగిసింది. 112 పాయింట్లు ప్లస్సయిన నిఫ్టీ 18 వేల 165 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 23 కంపెనీలు పాజిటివ్ ఫలితాలను రాబట్టాయి.
Today (18-01-23) Business Headlines: ‘దావోస్’.. బోరింగ్. అందుకే వెళ్లలే: మస్క్. మరిన్ని వార్తలు
నిఫ్టీలో హిండాల్కో, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ భారీగా ప్రాఫిట్స్ పొందాయి. టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఘోరంగా దెబ్బతిన్నాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మెటల్ ఇండెక్స్ బాగా రాణించింది. ఒక శాతం వరకు పురోగమించింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచీ 1 శాతం వరకు పడిపోయింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే యురేకా ఫోర్బ్స్ షేర్ల ధర రికార్డు లెవల్లో నమోదైంది. మూడు వారాల్లో 20 శాతం ర్యాలీ తీసింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, మహింద్రా అండ్ మహింద్రా, బీపీసీఎల్, ఎస్‌బీఐ షేర్లు తీవ్రంగా వెనకబడ్డాయి. 2 పాయింట్ 7 శాతం వరకు డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర అతి స్వల్పంగా 28 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 380 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 354 రూపాయలు పెరిగి అత్యధికంగా 69 వేల 540 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 49 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 31 పైసల వద్ద స్థిరపడింది. క్రూడాయిల్ ధర 111 రూపాయలు లాభపడి ఒక బ్యారెల్ చమురు రేటు 6 వేల 628 రూపాయలుగా నమోదైంది.