Today (18-01-23) Business Headlines:
హైదరాబాదులో పెప్సికో విస్తరణ
అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది. ‘దావోస్’లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా పెప్సికో ఈ ప్రకటన చేసింది.
రేపు కేంద్ర ఆర్థిక మంత్రి కీలక భేటీ
ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు సమావేశం కానున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సామాజిక, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించనున్నారు. జన్ ధన్ యోజన, ముద్ర, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం స్వనిధి తదితర పథకాలపై రివ్యూ చేస్తారు. మరింత మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురావటానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అందుకే ‘దావోస్’కి వెళ్లలేదు: మస్క్
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పరమ బోరింగ్ వ్యవహారమని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. అందుకే తాను ‘దావోస్’లో జరుగుతున్న సమావేశాలకు హాజరుకాలేదని చెప్పారు. అయితే.. ఎలాన్ మస్క్ చేసిన ఈ చులకన వ్యాఖ్యలపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం స్పందించింది. అసలు తాము అతణ్ని ఈ సమావేశాలకి ఆహ్వానించ లేదని పేర్కొంది. ఇప్పుడే కాదు.. 2015వ సంవత్సరం నుంచి ఎలాన్ మస్కుని ఈ సమావేశాలకు పిలవట్లేదని స్పష్టం చేసింది. తనను ఆహ్వానించారని, తానే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని ఎలాన్ మస్క్ గత నెలలో పేర్కొనటాన్ని కూడా ప్రపంచ ఆర్థిక వేదిక ఖండించింది.
భారత వజ్ర వ్యాపారుల సమస్యలు
భారతీయ వజ్ర వ్యాపారులు ఈమధ్య కాలంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరెన్సీ రిస్కులు కూడా ఇందులో ఒక భాగమని జెమ్ అండ్ జ్యూలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ పేర్కొంది. రూపాయల్లో చేసే చెల్లింపులను రష్యన్లు సౌకర్యవంతంగా భావించట్లేదు. రూపాయల్లో వాణిజ్యం చెల్లింపులు చేసేందుకు జులై నెలలో అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక సదుపాయాన్ని ఇప్పటివరకు ఒక్కరు కూడా వాడుకోలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల తర్వాత రష్యా నుంచి జరగాల్సిన సరఫరా 40 శాతం పడిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
50 ఏళ్ల కనిష్టానికి చైనా గ్రోత్ రేట్
చైనా గ్రోత్ రేట్ 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆ దేశ జీడీపీ 18 లక్షల కోట్ల డాలర్ల నుంచి 17 పాయింట్ తొమ్మిది, నాలుగు లక్షల కోట్ల డాలర్లకు డౌన్ అయింది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలను చైనా జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. 1974 తర్వాత చైనా వృద్ధి రేటు ఇంత తక్కువగా నమోదు కావటం ఇదే తొలిసారి. ఒకప్పుడు ‘జెట్ స్పీడ్’తో దూసుకెళ్లిన చైనా ఇప్పుడు ఈ స్థాయికి దిగజారటం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ ఫార్మా సంస్థ ఘనత
హైదరాబాదుకు చెందిన MSN గ్రూప్ ప్రపంచంలోనే తొలిసారిగా రొమ్ము క్యాన్సర్ మందును ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చింది. పాల్బోసిక్లిబ్ అనే ఔషధాన్ని 75, 100, 125 మిల్లీ గ్రాముల డోసుల్లో రూపొందించింది. ఈ మెడిసిన్ ని ఫైనల్ స్టేజ్ లో ఉన్న రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వినియోగిస్తారు. ఈ మందును పాల్బోరెస్ట్ అనే బ్రాండ్ పేరుతో అమ్ముతోంది. ఎక్కువ సంస్థలు క్యాప్యూల్స్ రూపంలో విక్రయిస్తుండగా తాము అందుబాటులోకి తెచ్చిన ట్యాబ్లెట్ల వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని MSN గ్రూపు పేర్కొంది.