Today (16-01-23) Business Headlines
డీమ్యాట్ ఖాతాల డిటెయిల్స్
డీమ్యాట్ కొత్త ఖాతాల సంఖ్య 2022 డిసెంబర్ నెలలో 34 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 20 లక్షలు, అక్టోబర్ నెలలో 18 లక్షలు, నవంబర్ నెలలో కూడా 18 లక్షల అకౌంట్లు ఓపెనయ్యాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 10 పాయింట్ 8 కోట్లుగా నమోదయ్యాయి. అయితే.. 2021తో పోల్చితే మాత్రం 2022లో డీమ్యాట్ అకౌంట్లు తగ్గాయి. ఈ డేటాను మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించింది.
చేతులు మారిన ఆంధ్రా సిమెంట్స్
ఆంధ్రా సిమెంట్స్ సంస్థ చేతులు మారింది. ఆ కంపెనీని సాగర్ సిమెంట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సాగర్ సిమెంట్స్.. స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దివాలా తీసిన ఆంధ్రా సిమెంట్సును ఆ సమస్య పరిష్కార ప్రక్రియలో భాగంగా సాగర్ సిమెంట్స్ ఇతర సంస్థలతో పోటీపడి గెలుచుకుంది. ఈ పోటీలో దాల్మియా సిమెంట్ ఇండియా లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్, ఖండ్వాలా ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఆదేశాల మేరకు ఈ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టడం తెలిసిందే
పెరిగిన బిజినెస్ కాన్ఫిడెన్స్
2022 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో భారతీయ కంపెనీల బిజినెస్ కాన్ఫిడెన్స్ 2 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ఎదురుగాలులను సమర్థంగా తట్టుకొని నిలబడుతున్న మన ఎకానమీ పట్ల ఇండస్ట్రీ లీడర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో.. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలోని బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్సులో అధిక రీడింగ్ 67 పాయింట్ 6 నమోదైంది. జులై-సెప్టెంబర్ ‘క్వార్టర్’లో ఇది 67 పాయింట్ 2 మాత్రమే.
‘బ్రాండ్ అంబాసిడర్’గా సెహ్వాగ్
‘గ్లోబల్ మార్కెట్’లో సక్సెస్ అయిన మెక్ డొనాల్డ్స్ కంపెనీ స్పెషల్ ఫుడ్ ఐటమ్.. చికెన్ బిగ్ మాక్ బర్గర్.. ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మన దేశంలో కొత్త రుచిని పరిచయం చేస్తున్నట్లు మెక్ డొనాల్డ్స్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఆహార ఉత్పత్తికి ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ వ్యవహరించనున్నారు. మెక్ డొనాల్డ్స్ ఐకానిక్ ప్రొడక్ట్ అయిన ఈ ‘చికెన్ బిగ్ మాక్ బర్గర్’.. సంబంధిత ప్రియులందరికీ ‘ఫేవరెట్ ఐటమ్’గా నిలుస్తుందని సెహ్వాగ్ చెప్పారు.
కన్జ్యూమర్ కంపెనీలు కేక
2022లో కన్జ్యూమర్ కంపెనీలు కేక పుట్టించాయి. ఆ సంస్థల డీల్స్ యాక్టివిటీ 25 ఏళ్ల గరిష్టానికి చేరింది. మొత్తం 645 డీల్స్ నమోదయ్యాయి. ఇందులో అక్విజిషన్లు, ఇన్వెస్ట్మెంట్స్, స్టేక్ పర్ఛేజెస్ వంటివి ఉన్నాయి. 1998వ సంవత్సరం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో డీల్స్ నమోదుకావటం ఇదే తొలిసారి. ఈ లావాదేవీల మొత్తం విలువ 18 పాయింట్ 4 బిలియన్ డాలర్లని బ్లూమ్-బర్గ్ డేటా తెలిపింది. వర్ధమాన వినియోగదారు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంలో అంబానీ, బిర్లా, టాటా సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.
‘ట్విట్టర్’ ఆఫీసులో బొద్దింకల సమస్య
న్యూయార్క్ సిటీలోని ట్విట్టర్ ఆఫీసులో బొద్దింకల సమస్య వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలోని ఎంప్లాయీ ఏరియాస్, ఛేంజింగ్ రూమ్స్ మరియు షవర్లలో ఇటీవల కాక్రోచెస్ కనిపించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ ఆఫీసు బిల్డింగ్ యాజమాన్య కంపెనీ ప్రతినిధి ఈ వార్తలను ఖండించగా దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ రిప్రజెంటేటివ్ నిరాకరించారు. ‘ట్విట్టర్’ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక నిత్యం ఇలాంటి చిన్నాచితక అంశాలు వార్తల్లో నిలుస్తుండటం గమనించాల్సిన విషయం.