Today (13-02-23) Business Headlines:
మనోళ్లే మార్కెట్ ఓనర్లు
ఇండియన్ ఈక్విటీ మార్కెట్’లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్.. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్’లో లైఫ్ టైమ్ హయ్యస్ట్ లెవల్’కి చేరుకుంది. అంటే.. 24 పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది. వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా గ్రోత్ నెలకొనటం విశేషం. ఈ యాజమాన్యం.. వ్యక్తులు మరియు సంస్థలది కావటం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉండగా.. రిటైల్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్ మాత్రం సున్నా పాయింట్ ఒకటీ ఒకటీ శాతం తగ్గింది. మరోవైపు.. మన దేశ మార్కెట్’లో విదేశీయుల పెట్టుబడులు కూడా సెప్టెంబర్ కన్నా డిసెంబర్’లో పెరిగాయి.
ప్రభుత్వ బ్యాంకులు భేష్
ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. డిసెంబర్ క్వార్టర్’లో 29 వేల 175 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేశాయి. పోయినేడాది ఇదే సమయంతో పోల్చితే ప్రాఫిట్ 65 శాతం పెరగటం చెప్పుకోదగ్గ అంశం. నాలుగు బ్యాంకుల లాభదాయకత వంద శాతానికి పైగా నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు 70 వేల 166 కోట్ల రూపాయలకు చేరాయి. అంతకుముందు సంవత్సరం ఇదే వ్యవధి కన్నా ఇది 43 శాతం ఎక్కువ.
పన్నుల వసూళ్లు వహ్వా
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాక ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24 శాతం పెరిగి 15 పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లకు చేరుకున్నాయి. రిఫండ్ల అనంతరం నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18 పాయింట్ నాలుగు సున్నా శాతం పెరిగాయి. తద్వారా 12 పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సవరించిన అంచనాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇప్పటివరకు 79 శాతానికి చేరుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వెల్లడించింది. మొత్తం 14 పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలవుతాయని బడ్జెట్’లో అంచనా వేశారు.
హైదరాబాద్ సిటీలో ఆఫీస్
సాఫ్ట్’వేర్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసులను అందిస్తున్న అమెరికా సంస్థ TSQS ఇంక్.. హైదరాబాదులో ఆఫీసును ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి అతితక్కువ సంఖ్యలో 15 మంది ఇంజనీరింగ్ ఎక్స్’పర్ట్’లను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంది. సంస్థ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి వంద మందికి కొలువులు ఇస్తామని పేర్కొంది. వచ్చే సంవత్సరంలో మరో 250 మందిని రిక్రూట్ చేసుకోనుంది. గ్లోబల్ సాఫ్ట్’వేర్ టెస్టింగ్ మార్కెట్ సంవత్సరానికి సగటున 6 శాతం వృద్ధి చెందుతోందని తెలిపింది.
శ్రీసిటీ టూ ‘వందే భారత్’
ఆంధ్రప్రదేశ్’లోని శ్రీసిటీలో ఉన్న BFG ఇండియా అనే సంస్థ తాజాగా వందే భారత్ రైలు కోసం కూడా విడి భాగాలను సరఫరా చేస్తోంది. రైలు లోపలి భాగాలు, టాయిలెట్ క్యాబిన్, ఇంజన్ ముందు భాగాన్ని తయారు చేస్తోంది. ఒక రైలు కోసం ఏకంగా 329 రకాల FRP ప్యానెల్స్’ను రూపొందిస్తోంది. FRP అంటే.. ఫైబర్ రీఇన్’ఫోర్స్ ప్లాస్టిక్ అని అర్థం. BFG ఇండియా సంస్థ ఈ విడి భాగాలను గడచిన నాలుగేళ్లుగా వివిధ రంగాల్లోని పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. చెన్నై, కొచ్చి మెట్రో ప్రాజెక్టుల కోసం కూడా వివిధ ఉత్పత్తులను అందిస్తోంది.
టర్కీకి ఎగుమతులు టఫ్
టర్కీలో ఇటీవల భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఇండియా నుంచి ఆ దేశానికి జరగాల్సిన ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మన దేశం నుంచి టర్కీకి నూలు, పత్తి మరియు వస్త్రాలకు వేసే రంగుల వంటి సరుకుల ఎగుమతులు సమీప భవిష్యత్తులో మందగించనున్నాయి. భూకంపం వల్ల టర్కీలో ఇన్’ఫ్రాస్ట్రక్చర్ మరియు లాజిస్టిక్స్ నెట్’వర్క్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో.. ఇస్కెండెరన్ అనే నౌకాశ్రయాన్ని వారం రోజులుగా మూసి ఉంచుతున్నారు.