Site icon NTV Telugu

Tirupati Election: డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ.. క్యాంప్ రాజకీయాలతో రసవత్తర పరిణామాలు

Chitoor Elections

Chitoor Elections

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో క్యాంప్ రాజకీయాలు ఉధృతంగా సాగాయి. వైసీపీ కార్పొరేటర్లు పాండిచ్చేరి క్యాంప్‌లో ఉండగా, వారు కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్నారు. మరోవైపు, చిత్తూరులో బసచేసిన వైసీపీ కార్పొరేటర్లను రాత్రి తిరుపతి టీడీపీ నేతలు కలిసే ప్రయత్నం చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విషయం తెలుసుకున్న భూమన అభినయ రెడ్డి హుటాహుటిన చిత్తూరుకు చేరుకుని తన పార్టీ కార్పొరేటర్లను తిరుపతిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచే నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Also Read: Elections In AP: నేడు రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు హోరాహోరీగా ఎన్నికలు

వైసీపీ గత ఎన్నికల్లో 48 కార్పొరేటర్లను గెలుచుకున్నప్పటికీ, ఇప్పటికే 20 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, పళ్ళిపట్టు సమీపంలోని రేవా రిసార్ట్స్‌లో ఉండిన కూటమి కార్పొరేటర్లు ఈ ఉదయం తిరుపతికి బయలుదేరారు. వీరంతా ఎన్నికల కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు ఎన్నికల్లో 47 మంది కార్పొరేటర్లతో పాటు తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ, ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించనున్నారు. మొత్తంగా 50 ఓట్లు ఉండగా, గెలుపు కొరకు 26 ఓట్లు అవసరం. అయితే, ప్రస్తుతం ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఎన్నికల ఫలితం గూఢరహస్యంగా మారింది.

ఈ ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభంకానుండగా, డిప్యూటీ మేయర్ ఎవరవుతారన్న దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. అధికార వైసీపీ తన సీటును నిలబెట్టుకుంటుందా, లేక విపక్ష కూటమి ఈ పదవిని చేజిక్కించుకుంటుందా అన్నది కొద్ది గంటల్లో తేలనుంది.

Exit mobile version