Tirumala Update: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శనివారం) క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం తిరుమల శ్రీవారిని 74,502 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారికి 38,052 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Read Also: Andhrapradesh: నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న నడ్డా
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుపతి చుట్టుపక్కల అందాలను తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను విహంగ వీక్షణం చేసేందుకు ‘ఏరో డాన్’ అనే సంస్థ జాయ్ రైడ్‌ని తీసుకొచ్చింది. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజులు ట్రయల్ నిర్వహించనున్నారు. దీనికోసం టికెట్ బుకింగ్స్ కూడా శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆరు సీట్ల కెపాసిటీ ఉన్న హెలికాప్టర్‌లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కే అవకాశముంది. తిరుపతి నుంచి చంద్రగిరి పోర్టు వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. ఈ రైడ్ కేవలం 8 నిమిషాల్లోనే పూర్తవుతుంది. గంటలకు ఆరు రైడ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.6వేలు ఛార్జ్ చేస్తారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి నిత్యం వేలాది మంది వస్తుంటారని.. వారందరికీ తిరుపతి చుట్టుపక్కల అందాలు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రైడ్ ప్రారంభిస్తున్నట్లు ఏరో డాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి వాసులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ రైడ్ సక్సెస్ అయితే తిరుపతి టు చెన్నై మార్గంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని ఏరో డాన్ యాజమాన్యం స్పష్టం చేసింది.