NTV Telugu Site icon

Tirumala: టీటీడీ ఈవో కీలక నిర్ణయం.. ఇక వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలు

Tirumala

Tirumala

Tirumala: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీడీడీ ఈవో ధర్మారెడ్డి తెలపారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఈవో.. ఫోన్ లైన్‌లో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

సుప్రభాత సేవ విచక్షణ కోటాను రద్దు చేశామని.. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతారని అన్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్‌ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని ఈ విషయాన్ని భక్తులు మర్చిపోవద్దని ఈవో విజ్ఞప్తి చేసారు. వేదాల్లోని దాదాపు 190 అంశాలను భావితరాలకు అందించేందుకు శ్రీవేంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రాజెక్టు అంశాలను ‘భారతీయ విజ్ఞానదాన’ పేరుతో సోషల్‌మీడియా, ఎస్వీబీసీల ద్వారా పది నిమిషాల వీడియో ప్రసారాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల విలువైన పదెకరాల భూమిని తితిదేకు కేటాయించిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేమండ్స్‌ అధినేత గౌతమ్‌ సింఘానియా రూ.100 కోట్లు వెచ్చించనున్నారని తెలిపారు. జూన్‌ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సామాన్లు బయట పడేసిన సిబ్బంది

టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జమ్మూలోని మజీన్‌ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్‌ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించిందని ఈవో చెప్పారు. ఆభూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈనెల 3 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. 8న జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,434 మంది భక్తులు దర్శించుకోగా.. 39,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చింది.

Show comments