NTV Telugu Site icon

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల

Tirumala

Tirumala

Tirumala Tickets: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి గంటల పాటు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా టీటీడీ కొన్ని ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవలు, వసతి గదులు ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను నేటి ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

Read Also: Tirumala: టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యతా లోపాలు.. బ్లాక్‌లిస్ట్‌లోకి సరఫరాదారు!

రేపు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్‌ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జులై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకే అక్టోబర్‌ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది.