First Time Team India Lost T20I Series under Hardik Pandya Captaincy: కరీబియన్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను అలవోకగా సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. లాడర్‌హిల్‌లో ఆదివారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో టీ20లో టీమిండియా పరాజయంను ఎదుర్కొంది. భారత్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రెండన్ కింగ్ (85 నాటౌట్; 55 బంతుల్లో 5×4, 6×6), నికోలస్ పూరన్ (47; 35 బంతుల్లో 1×4, 4×6) మెరిశారు. అంతకుముందు భారత్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (61; 45 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు.
సిరీస్ డిసైడర్ అయిన ఐదో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయి 165 రన్స్ చేసింది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), శుభ్‌మన్ గిల్ (9) నిరాశపరిచారు. మూడు ఓవర్లలోపే ఓపెనర్లిద్దరూ స్పిన్నర్ అకీల్ హోసీన్ వెనక్కి పంపాడు. ఈ సమయంలో తిలక్ వర్మ (27; 18 బంతుల్లో 3×4, 2×6) సాయంతో సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. అయితే దూకుడుగా ఆడిన తిలక్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆపై సంజు శాంసన్ (13), హార్దిక్ పాండ్యా (14) విఫలమయ్యారు. ఆపై భారత్ వెంటవెంటనే వికెట్స్ కోల్పోవడంతో మోస్తరు స్కోర్ నమోదు చేసింది.
ఛేదనలో వెస్టిండీస్ రెండో ఓవర్లో కైల్ మేయర్స్ (10) వికెట్ కోల్పోయింది. బ్రెండన్ కింగ్‌కు నికోలస్ పూరన్ తోడవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పూరన్, కింగ్ బౌండరీలతో చెలరేగడంతో విండీస్ 7 ఓవర్లలో 71/1తో నిలిచింది. ఈ ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్‌ను కొనసాగించడంతో వెస్టిండీస్ లక్ష్యం దిశగా సాగింది. అయితే 12.3 ఓవర్ల వద్ద (117/1) వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. 40 నిమిషాల తర్వాత ఆట తిరిగి ఆరంభం కాగా.. పూరన్ ఔట్ అయ్యాడు. షై హోప్ (22 నాటౌట్)తో కలిసి కింగ్ విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ టీ20 సిరీస్‌ను కోల్పోవడం ఇదే మొదటిసారి. హార్దిక్ నేతృత్వంలో భారత్ ఇదివరకు నాలుగు సిరీస్‌లు గెలుచుకుంది. ఇక 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే మొదటిసారి. ఇక ఈ నెల చివరలో జరిగే ఆసియా కప్ 2023లో భారత ప్రధాన జట్టు బరిలోకి దిగనుంది.