భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ శైలి, జట్టు అవసరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే, ఐర్లాండ్ పర్యటనల్లో ప్రారంభంలోనే వికెట్లు పడిపోవడంతో మైదానంలోకి అడుగుపెట్టగానే దూకుడుగా ఆడటం సరికాదని, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశారు. జింబాబ్వేతో తొలి టీ20కి ముందు మాట్లాడిన ఆయన, జట్టు ప్రయోజనాల కోసమే కొన్నిసార్లు ఓపికగా ఆడాల్సి వస్తుందని తెలిపారు.
తొలి ఓవర్లలోనే 4, 5 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వెళ్లి తొలి బంతి నుంచే షాట్లు ఆడి అవుట్ కావడం బాధ్యతారాహిత్యం అవుతుందని.. అలా నేను ఆడలేనని తిలక్ అన్నారు. దేశానికి ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా వైస్ కెప్టెన్సీ బాధ్యత ఉన్నప్పుడు మేనేజ్‌మెంట్ ఆశించే వ్యూహాలకు లోబడి ఆడటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఆసియా ఖండంలోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడటం వల్ల యూకే పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోయామని, అందుకే అక్కడ ఓటములు ఎదురయ్యాయని వివరించారు.
ఇంగ్లాండ్ బలమైన జట్టు అని, తమ ప్రదర్శన నుంచి నేర్చుకున్న పాఠాలు ముందుముందు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే జింబాబ్వే సిరీస్‌పై స్పందిస్తూ, జింబాబ్వేను తక్కువగా అంచనా వేయలేమని, వారు సవాలు విసిరే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పర్యటన అనుభవాలు, ఐర్లాండ్-ఇంగ్లాండ్ సిరీస్‌ల నుంచి నేర్చుకున్న విషయాలు ఈ సిరీస్‌లో జట్టుకు కలసివస్తాయని తిలక్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.

