తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతుంది. సుమారు 23 వేల మంది సిబ్బంది పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో, రహదారులపై పటాకులు కాల్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. పర్మిషన్ ఉన్నవాళ్లు మినహా ఇతరులు ఆ పరిసరాల్లోకి రావొద్దని పేర్కొన్నారు.
Read Also: D.K Shivakumar: రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్.. హైదరాబాద్ లో దిగిన డీకే శివకుమార్
ఇక, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్‌కు తెలియజేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లోకి ఎవరు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు, వారి ఆస్తులకు సైతం భద్రత కల్పించాలి.. జిల్లాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ఇరు పక్షాల రాజకీయ నాయకులతో మాట్లాడుతూ.. సమన్వయం చేసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకూ ముఖ్యంగా సోమవారం వరకు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని డీజీపీ పేర్కొన్నారు.
Read Also: Telangana Election Results 2023: ఓపెన్ చేసి దర్శనమిచ్చిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు?
అయితే, ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో పాటు అగ్నిమాపకశాఖ సిబ్బంది సైతం డ్యూటీ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పివేసే సిబ్బందిని రెడీగా ఉంచినట్లు ఏడీజీ వై నాగిరెడ్డి చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎప్పటికిప్పుడు పరిస్థితిని సమీక్షస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సుమారు 300 మంది సిబ్బందితో, ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచామని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు.