ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి ఎలాంటి హాని తలపెట్టదని అధికారులు తెలిపారు.
READ MORE: Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు. అదే పులిని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద, సాయంత్రం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు మాకిడి రైల్వే క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా గుర్తించారు. అలాగే… ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం బోదాపురం, ఆలుబాక సమీపంలోని గోదావరి లంకలోనూ మంగళవారం పులి సంచరించింది. బోదాపురం రైతు కొర్స నర్సింహారావు లంకభూమిలో పుచ్చ పంట సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి పంటకు రక్షణగా వెళ్లి అక్కడ వేసుకున్న పాకలో నిద్రించారు. అర్ధరాత్రి పులి గాండ్రింపులు వినిపించాయి. మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు.