Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!

  • తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై..
  • నేడు ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక భేటీ..
  • కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో సమావేశం..
Thummadi

Thummadi

Thummidihatti Barrage: తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నెలకొన్న అంశాలపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు.

ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా బ్యారేజ్‌ ఎత్తు, నీటి వినియోగం, ముంపు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ను 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర గతంలో అంగీకరించింది. అయితే ఈ ఎత్తుతో అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. 148 మీటర్ల వద్ద నీటిని తరలించేందుకు భారీ పంపులను వినియోగించాల్సి వస్తుందని, దీంతో విద్యుత్‌ వ్యయం గణనీయంగా పెరుగుతుందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. అందువల్ల బ్యారేజ్‌ ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 152 మీటర్ల ఎత్తుతో నీటిని తక్కువ విద్యుత్‌ వ్యయంతో తరలించడంతో పాటు దీర్ఘకాలంలో రాష్ట్రానికి ప్రాజెక్టు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తన వాదనను వినిపిస్తోంది.

మరోవైపు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టాన్ని పెంచడం వల్ల అదనంగా ఏర్పడే ముంపు పరిమితంగానే ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని కూడా సమావేశంలో మహారాష్ట్ర అధికారుల ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించడంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కీలకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో చర్చలను ముందుకు తీసుకెళ్తోంది.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ప్రధానమంత్రిని కోరారు. అలాగే మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం నిర్వహించి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నేటి ఢిల్లీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.