గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఆరు నెలల క్రితం హమాస్‌పై ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం ఇంకా నిరాంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిపిన దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేష్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇస్మాయిల్ తీవ్ర షాక్‌కు గురయ్యారు. పగ, ప్రతీకారాలతో తన ముగ్గురు పిల్లలను మరో ముగ్గురు మనవళ్లను ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా హత్య చేసిందని ఇస్మాయిల్ వాపోయారు. చట్టాలను, విలువలను ఏ మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జెరూసలెం, అల్ అక్సా మసీదును విముక్తి చేసే పనిలో తన కుమారులు అమరులయ్యారని ఆయన తెలిపారు. తన పిల్లలను చంపినంత మాత్రాన పాలస్తీనా విషయంలో తన వైఖరి మారదని తేల్చిచెప్పారు.
ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. ముగ్గురూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌తో అమెరికా, ఖతర్ లాంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికా సయోధ్య కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందా? లేదంటే ముందుకే సాగిపోతుందా? వేచి చూడాలి.
איסמאעיל הנייה מקבל את ההודעה על מות בניו ונכדיו pic.twitter.com/nnuT1JB09L
— הארץ חדשות (@haaretznewsvid) April 10, 2024