ప్రస్తుతం ఝార్ఖండ్ తీవ్ర రాజకీయ సంక్షోభంపై ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇందులో ముగ్గురు సీఎంలు అరెస్ట్ కావడం విశేషం. ఈ ముగ్గురు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా మూడు సార్లు రాష్ట్రపతి పాలన కూడా విధించారు. తాజాగా మరోసారి ఆ పరిస్థితి దాపురించే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటిగా శిబు సోరెన్, రెండోది మధుకోడా, మూడోదిగా హేమంత్ సోరెన్.. ఇలా ముఖ్యమంత్రులుగా ఉండి అరెస్ట్ అయిన వారు ఒకే రాష్ట్రానికి సంబంధించిన వారు కావడంతో సర్వత్రా చర్చ సాగుతోంది.
శిబు సోరెన్..
బుధవారం సాయంత్రం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఝార్ఖండ్ చరిత్రలో ముఖ్యమంత్రులుగా ఉండి అరెస్ట్ అయిన లిస్ట్‌లో మూడోవాడిగా చేరారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు సీఎంగా ఉన్నారు. అటు తర్వాత 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
మధు కోడా..
ఇక శిబు సోరెన్ తర్వాత మధు కోడా ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యారు. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మధు కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో ఆయన దోషిగా తేలారు. దీంతో మధు కోడాకు మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు.
హేమంత్ సోరెన్..
తాజాగా ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఓ భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఒకే కుటుంబం నుంచి శిబు సోరెన్, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రులుగా ఉండి అరెస్ట్ కావడం విశేషం.
రఘువర్ దాస్ మాత్రమే…
జార్ఖండ్ రాష్ట్రం నవంబరు 15, 2000 సంవత్సరమున ఏర్పడింది. ఇప్పటివరకూ ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.