Women Reservation Bill: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో బంపర్ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభలోని 545 మంది ఎంపీలకు గానూ 456 మంది సభకు హాజరై ఓటు వేశారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను ప్రారంభించారు. ఓటేసిన 456 మంది లోక్‌సభ సభ్యులలో 454 మంది మద్దతుగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఔరంగాబాద్/ఛత్రపతి శంభాజీనగర్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళల రిజర్వేషన్లలో మహిళలకు కోటా లేకపోవడంతో వీరు ఈ బిల్లును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
Also Read: Big Breaking: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇది కేవలం “సవర్ణ మహిళల”(అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును ‘‘చెక్ బౌన్స్ బిల్లు’’, ‘‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లు’’గా విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ఓవైసీ.. కేంద్రం సవర్ణ మహిళల ప్రాతినిధ్యం పెంచాలని చూస్తోందని ఆరోపించారు. వారికి ఓబీసీ, ముస్లిం మహిళలు అక్కర్లేదని దుయ్యబట్టారు. 17వ లోక్ సభ వరకు మొత్తం 690 మంది మహిళా ఎంపీలు ఎన్నికైతే దీంట్లో కేవలం 25 మంది మాత్రమే ముస్లిం వర్గానికి చెందిన మహిళా ఎంపీలున్నారని తెలిపారు. హిందూ జాతీయ వాదాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ మెజారిటీ, జాతీయవాదం పెరగడం హిందూ ఓటు బ్యాంకు ఏర్పడటం, ముస్లిం ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, అది మరింగా తగ్గుతుందని మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు.