Site icon NTV Telugu

Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..

Fugitive Economic Offenders

Fugitive Economic Offenders

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా తెలుసుకుందాం..

మెహుల్ చోక్సీ..
2018 ప్రారంభంలో, పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అరెస్ట్ అయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ సహా అనేక మందిపై బ్యాంకు ఫిర్యాదు చేసింది. నిందితులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, కుట్రపన్ని బ్యాంకుకు నష్టం కలిగించారని బ్యాంకు ఆరోపించింది. బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత, 2018 ఫిబ్రవరిలో ఈ మోసం గురించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం అందించింది. ఈ ఆరోపణల తర్వాత మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం అతడిని బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు.

విజయ్ మాల్యా
కింగ్‌ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉన్నాడు మాల్యా. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి భారీగారుణాలుగా తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా మూతపడింది. 2016 నుంచి లండన్‌లోనే నివసిస్తున్నారు. విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అక్కడి న్యాయ వ్యవస్థతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. న్యాయ పోరాటం చేస్తోంది.

నీరవ్ మోడీ..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్ల రూపాయల స్కామ్‌లో నీరవ్ మోడీ కూడా నిందితుడిగా ఉన్నారు. 2018 జనవరిలో నీరవ్ భారత్ నుంచి పరారయ్యారు. లండన్‌లోని హోబర్న్‌లో ఉన్న మెట్రో బ్యాంక్ బ్రాంచ్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు వెళ్లినప్పుడు, 2019 మార్చి 19న నీరవ్ మోడీ అరెస్టయ్యారు. నీరవ్ మోడీ అప్పగింత కేసు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో 2020 మే నుంచి నడుస్తోంది. నీరవ్ మోడీ కుటుంబం తరాలుగా వజ్రాల వ్యాపారంలో ఉంది. భారత్‌లో రిటైల్ జ్యువెల్లరీ కంపెనీ అయిన గీతాంజలి గ్రూప్ అధిపతి మెహుల్ చోక్సీతో నీరవ్ మోడీ దాదాపు 10 ఏళ్లు కలిసి పనిచేశారు.

నితిన్ సందేసరా..
గుజరాత్‌కు చెందిన బడా వ్యాపారవేత్త నితిన్ సందేసరా.. బ్యాంకులను రూ.5,700 కోట్లకు మోసం చేయడం, మనీలాండరింగ్ వంటి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ యజమాని అయిన నితిన్ జె.సందేసరాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు. ఈయనతో పాటు హితేశ్ నరేంద్రభాయ్ పటేల్, దీప్తి సందేసరా, చేతన్ సందేసరా కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈయన 2017లో దుబయ్ మీదుగా నైజీరియాకు వెళ్లిపోయింది. నితిన్ సందేసరా కుటుంబానికి నైజీరియా, అల్బేనియా దేశాల పౌరసత్వం ఉంది. ఆయా దేశాలతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది.

Exit mobile version