ఒడిశా రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ నిన్న (శనివారం) మధ్యాహ్నం ముగిసిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి బాధితులను తరలించేందుకు 200 అంబులెన్స్ లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లను ఉపయోగించినట్లు ఒడిశా అధికారులు చెప్పారు. సుమారు 1200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మృతదేహాలను తరలించేందుకు అన్ని వాహనాలను వాడుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
Also Read: SP Balu: పాటగా బ్రతకవా మా అందరి నోటా…
రైలు ప్రమాద స్థలంలో 300 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. మెటల్ కట్టర్స్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్, హెవీ లిఫ్ట్ ఎక్విప్ మెంట్లతో వారంతా బాధితుల కోసం వెతికారని ఆయన అన్నారు. లోకల్ పోలీసులు, రైల్వే సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 9 బృందాలుగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వీరిలో మహిళా సిబ్బంది, మెడికల్ టీమ్స్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ల సభ్యులు 44 మందిని ప్రాణాలతో కాపాడారని, 71 మంది మృతదేహాలను వెలికితీశారన్నారు. ప్రధానంగా ధ్వంసమైన రైలు బోగీలను కట్ చేస్తూ, వాటిలో బతికి ఉన్న వారిని కాపాడటమే తమ సిబ్బందికి ఇచ్చిన మెయిన్ టాస్క్ అన్నారు.
Also Read: Uttarapradesh : 8 ఏళ్ల బాలికపై 80 వృద్ధుడు లైంగికదాడి..దారుణం..
రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఆ పరిసరాల్లో ఉన్న స్థానికులు పరుగుపరుగున వచ్చి చాలా మందిని కాపాడారు. బోగీల్లో నెత్తురోడుతున్న వారిని బయటకు తీసి సమీపంలోని దవాఖానలకు తరలించారు. పోలీసులకు, రైల్వే సిబ్బందికి కొందరు సమాచారం ఇవ్వగా.. మరికొందరు బాధితులను బయటకు తీశారు. గాయపడిన వాళ్లను ఇంకొందరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు సహాయం అందించారు.