వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు జనం పలు రకాల పానీయాలను తాగుతుంటారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో 20 రూపాయలకి లభ్యమైన అరడజను పెద్ద సైజు నిమ్మకాయలు.. ప్రస్తుతం 40 రూపాయల వరకు పలుకుతుంది. విడిగా అయితే ఒక్కో నిమ్మకాయను 10 రూపాయలు, చిన్న సైజుదైతే 5 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక, నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడంతో పాటు డిమాండ్ పెరగడం దీనికి ముఖ్య కారణం.. నిమ్మసాగు అధికంగా జరిగే కర్ణాటకలో ఈ ఏడాది ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర తగ్గినట్లు తెలుస్తుంది. దీంతో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
Read Also: Nithin’s Thammudu: అదేంటి ‘తమ్ముడు’.. నితిన్ అక్కడెక్కాడు.. ఈ లేడీ డ్రైవర్ ఎవరు..?
ఇక, నెల రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్‌లో 2 వేల రూపాయలు పలికిన 1,000 పెద్ద సైజు నిమ్మకాయలకు ఇప్పుడు ఏకంగా 7 వేల రూపాయలకు పైగా చెల్లిస్తున్నారు. అంటే, ఈ నెల రోజుల వ్యవధిలోనే నిమ్మకాయల ధరలు 350 శాతం పెరిగినట్టు స్పష్టమౌతుంది. దేశంలో నిమ్మసాగు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో జరుగుతుంది. ఏటా ఏపీలో దాదాపు 7, కర్ణాటకలో 3, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల నిమ్మకాయల దిగుబడి ఉండేది. రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు స్థానికంగా అమ్మడంతో పాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నిమ్మ దిగుబడి భారీగా తగ్గిపోయినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.