Thai Politics: ఓ ఫోన్ కాల్ లీక్ ఏకంగా దేశ ప్రధాని పదవికి గండం అయ్యింది. నిజం అండీ బాబు ఫోన్ కాల్ లీక్‌తో థాయిలాండ్ అతి పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి పటోంగ్టార్న్ షినవత్రాను ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం పదవి నుంచి తొలగించారు. ఏడాది క్రితం షినవత్రా దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అదే సమయంలో ఆమె దేశంలో అతి పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఏడాది తర్వాత చూస్తే ఆమె పదవి పోయింది. ఆమెను నైతిక ప్రవర్తన ఉల్లంఘనలకు దోషిగా న్యాయస్థానం నిర్ధారించి దేశ ప్రధాని పదవి నుంచి తొలగించారు.
READ ALSO: Vande Bharath: వందే భారత్ పై రైల్వే కీలక నిర్ణయం.. ఆ రూట్లో
కంబోడియా మాజీ నాయకుడితో ఫోన్ కాల్..
మే నెలలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంపై థాయిలాండ్ – కంబోడియా మధ్య ఘర్షణ జరిగింది. దీని తర్వాత థాయిలాండ్ ప్రధాని షినావత్రా కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో షినావత్రా దేశ ఆర్మీ జనరల్‌ను కూడా విమర్శించారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో తరువాత లీక్ అయింది. థాయిలాండ్ ప్రజలకు దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి సైన్యాన్ని విమర్శించడం చికాకు పెట్టింది. దీంతో షినావత్రా ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. విషయం రాజ్యాంగ ధర్మాసనం పరిధిలోకి వెళ్లడంతో విచారణ జరిగింది. జూన్‌లో లీక్ అయిన టెలిఫోన్ కాల్ సందర్భంగా షినవత్రా కంబోడియా మాజీ నాయకుడు హున్‌సేన్ వైపు మొగ్గు చూపారని రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆ సమయంలో రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై ఉద్రిక్తతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్ కాల్ జరిగిన తర్వాత కొన్ని వారాల్లోనే రెండు దేశాల మధ్య ఐదు రోజుల పాటు వివాదం చోటుచేసుకుంది. ఈ సంభాషణ జాతీయ ప్రయోజనాలను, ప్రధానమంత్రి పదవి నైతిక బాధ్యతలను దెబ్బతీసిందని కోర్టు పేర్కొంది. దీంతో రాజ్యాంగ న్యాయస్థానం తన తీర్పులో ప్రధాని షినవత్రాను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పార్లమెంట్ ఇప్పుడు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది.
ఎవరు కొత్త ప్రధానమంత్రి..
థాయిలాండ్‌లో కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియకు చాలా సమయం పట్టవచ్చు. అక్కడ షినవత్రా పార్టీ ఫ్యూథాయ్‌కు చాలా బలహీనమైన మెజారిటీ ఉంది. దీంతో ఆమె తన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. గత సంవత్సరం రాజ్యాంగ న్యాయస్థానం ఆమె పూర్వీకురాలు శ్రేత్తా థావిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించినప్పుడు షినవత్రాకు అదృష్టం కలిసి వచ్చి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది. పలు నివేదికల ప్రకారం.. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అధికార సమీకరణాలు మారవచ్చని అంచనా వేస్తున్నారు. పార్లమెంటు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునే వరకు డిప్యూటీ ప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్, మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపనున్నారు. తర్వాత ప్రధానిగా ఫ్యూథాయ్ పార్టీ నుంచి ఒకే ఒక పేరు ప్రముఖంగా వినిస్తుంది. అదే 77 ఏళ్ల చైకాసెం నితిసిరి. తర్వత స్థానాల్లో మాజీ ప్రధాని, సైనిక నాయకుడు ప్రయుత్ చాన్-ఓచా, అనుతిన్ చార్న్‌విరాకుల్ ఉన్నారు. ఫోన్ కాల్ వివాదం తర్వాత అనుతిన్ ఇటీవల షినవత్రా ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకున్నారు.
READ ALSO: Jio IPO: 2026లో ఐపీఓకు జియో.. ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే..