ప్రతి రెండేళ్లకోసారి జరిగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో చిన్న నిర్మాతలంతా ఒక్కటయ్యారు. చదలవాడ శ్రీనివాసరావు, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్ కు అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రొగ్రెసివ్ ప్యానల్ మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈసీ మెంబర్ గా ఎలా పోటీ చేస్తారని మన ప్యానెల్ ప్రశ్నిస్తోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ సభ్యుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని ఆరోపిస్తోంది. గిల్ట్ పేరుతో కొంతమంది అగ్ర నిర్మాతలు సమూహంగా ఏర్పడి ఫిల్మ్ ఛాంబర్ కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని, ఫలితంగా గతపదేళ్లుగా పరిశ్రమ మొత్తం గాడితప్పిందని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సి.కళ్యాణ్ ఆరోపించారు. సొంత లాభాల కోసం పరిశ్రమను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీలో ఉన్న భవనంలో ఫిల్మ్ ఛాంబర్ కు అద్దె ప్రాతిపదికన మాత్రమే ఉందని, శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేకపోయారని మండిపడ్డారు.
Also Read : Telugu FilmChamber Elections : నేడు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. టాలీవుడ్ లో ఉత్కంఠ?
ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు మాత్రం పదవుల కోసం కాదు పరిశ్రమ అస్తిత్వాన్ని కాపాడటం కోసం పోటీ చేస్తున్నామని చెబుతున్నారు. పరిశ్రమకు వెన్నముకగా నిలిచే నిర్మాత కు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. నిర్మాతలకు భారంగా మారిన వర్చువల్ ప్రింట్ ఫీజు ను దశల వారీగా తొలగిస్తామని, టికెట్ ధరలు, తినుబండారాలను సామాన్యులకు అందుబాటులో ఉంచేలా చూస్తామని చెబుతిన్నారు. అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు శాశ్వత కార్యాలయంతోపాటు ఫిల్మ్ నగర్ లో 6 వేల గజాల స్థలంలో ఐకానిక్ టవర్ నిర్మిస్తామని ప్రొగ్రెసివ్ ప్యానల్ సభ్యులకు వివరిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసినా ఆ ప్రదేశాన్ని ఛాంబర్ అవసరాలకు తగిన విధంగానే ఐకానిక్ టవర్ గా మార్చాలని ఫిల్మ్ ఛాంబర్ మాజీ కార్యదర్శి దామోదర ప్రసాద్ సూచిస్తున్నారు. అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాతల మధ్య జరిగే ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగనుంది. ఎన్నికయ్యే నూతన కార్యవర్గం జులై 2027 వరకు ఫిల్మ్ ఛాంబర్ బాధ్యతలను నిర్వహించనుంది.