జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన మూడు ఉగ్రదాడి ఘటనల తర్వాత ఉగ్రవాదులు మరోసారి దేశంలో అనేక దాడులకు పాల్పడతారని బెదిరించారు. హర్యాన రాష్ట్రం అంబాలా రైల్వే స్టేషన్‌లో ఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ దొరికింది. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం, వైష్ణో దేవి ఆలయం, అమర్‌నాథ్ యాత్రలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో రాశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు రైల్వే స్టేషన్లు కూడా ఉగ్రవాదుల టార్గెట్‌గా ఉన్నాయి.
READ MORE: POCSO Case: సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప..
లేఖలో..“ఓ దేవా, దయచేసి నన్ను క్షమించు. జమ్మూ కాశ్మీర్‌లో మా జిహాదీల మరణానికి మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. జమ్మూలోని కథువా, పఠాన్‌కోట్ బియాస్ మరియు భటిండా రైల్వే స్టేషన్‌లపై సరిగ్గా జూన్ 21న బాంబులు వేస్తాం. జూన్ 23న కత్రా వైష్ణో దేవి, అమర్‌నాథ్ ఆలయం, శ్రీనగర్‌లోని లాల్ చౌక్, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్, హిమాచల్‌లోని అనేక దేవాలయాలపై బాంబు దాడి జరగనుంది. ఈసారి జమ్మూ-కశ్మీర్, పంజాబ్‌లను రక్తంతో చిత్రిస్తాం. అప్పుడే దేవుడు నన్ను క్షమిస్తాడు.” అని రాసి ఉంది. ఈ లేఖలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరు రాసి ఉంది. ఈ లేఖను లష్కరే తోయిబా ఏరియా కమాండర్ కుల నూర్ అహ్మద్ రాశారు. లేఖ దొరికిన తర్వాత భద్రతా సంస్థలు ఈ లేఖను పరిశీలిస్తున్నాయి. నిన్న రైల్వే పోలీసులకు అంబాలా రైల్వే స్టేషన్‌లో పరిధిలో ఈ బెదిరింపు లేఖ దొరికింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.