మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఫాంహౌస్‌లో ఏం జరిగిందనే దానిపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంపై ఎవరూ స్పందించవద్దని టీఆర్‌ఎస్ శ్రేణులకు ఆదేశించారు. అయితే.. ఈ ఘటనతో బీజేపీకి సంబంధం లేదని.. దీనికి స్ర్కిప్ట్ కేసీఆర్ రాశారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. ఇకనైనా తప్పు ఒప్పుకొని మునుగోడు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటే పరువు నిలుస్తుంది టీఆర్ఎస్ సంజయ్ సలహా ఇచ్చారు. లేదంటే.. దీనిపై యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. ఈ నేపథ్యంలోనే నేడు యాదాద్రికి బండి సంజయ్ బయలు దేరారు.
Also Read : DMK Leader on Khushboo: సినీ నటి ఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ వస్తున్నాడని సమాచారంతో అడ్డుకోవడానికి టీఆర్ఎస్ నేతలు యాదాద్రి చేరుకున్నారు. గో బ్యాక్ బండి అంటూ టీఆర్ఎస్ నేతల నినాదాలు చేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అంతేకాకుండా.. యాదాద్రిలోని బీజేపీ నేతలు బండి సంజయ్ ఫ్లెక్సీ కట్టడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆ ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది.