NTV Telugu Site icon

Temperature Drop: దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి

Temperature

Temperature

Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా… మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్‌లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. తెలంగాణలో సాయంత్రం అయిందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి. బయట అడుగుపెడదామంటే జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆ సమయంలో ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మెదక్‌లో అత్యల్పంగా 14 డిగ్రీలు, పటాన్‌చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 21 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇటు నిజమాబాద్, కరీంనగర్‌ ప్రాంతాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయ్‌. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Read Also: Karthika Masam: కార్తిక సోమవారం ఈ స్తోత్రాలు వింటే ఇంటిల్లిపాదికి సుఖసంతోషాలు

ఇక ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్‌. ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంటోంది. ఘాట్‌ రోడ్‌లో వెళ్లే వాహనదారులు.. మార్గం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి. కొందరైతే రోడ్లపై చలి మంటలు కాగుతూ సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. స్వెట్టర్లు వేసుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి. వృద్ధులు, చిన్నారులు చలి, పొగ మంచులో బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మూడు పూటలా వేడివేడి ఆహార పదార్థాలనే తినాలంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.